ఓ సరస్సులో నోట్ల కట్టలు కొట్టకు వచ్చాయి. అది కూడా అన్ని రూ.2000 నోట్లే.. అది చూసిన స్థానికులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, ఈ విషయం పోలీసులకు తెలియటంతో ఎంట్రీ ఇచ్చి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
రాజస్థాన్ అజ్మేర్లోని ఆనాసాగర్ సరస్సులో 2000 రూపాయల నోట్ల కట్టలు తేలియాడాయి. పాలిథీన్ బ్యాగులో ఉన్న వీటిని స్థానికులు గుర్తించారు. ఈ విషయం పోలీసులకు తెలియటంతో అక్కడి వెళ్లి.. డబ్బును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉండగా.. అన్ని 2 వేల నోట్లే అని పోలీసులు తెలిపారు.
పుష్కర్ రోడ్డులోని ఈ సరస్సులో భారీగా కరెన్సీ నోట్లు ఉన్నాయని తమకు సమాచారం అందిందని, వచ్చి చూస్తే నిజంగానే నోట్ల కట్టలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. అయితే ఈ నోట్లు నకిలీవా..? లేక నిజమైనవా..? అనే విషయం తెలియాల్సి ఉందని తెలిపారు. చూడటానికి మాత్రం నిజమైన నోట్ల లాగే ఉన్నాయని, నీటిలో తడవడం వల్ల నిర్ధారించుకోలేకపోతున్నట్లు చెప్పారు.
నిపుణుల సాయంతో నోట్ల అసలువో, కాదో తెలుసుకుంటామన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ నోట్ల కట్టలను పాలిథీన్ బ్యాగులో పెట్టి సరస్సులో విసిరేశారని పోలీసులు వివరించారు. మొదట నకిలీ నోట్లు అనుకున్నప్పటికీ, వాటిని చూశాక అసులవేమో అనే సందేహం వచ్చిందని చెప్పారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.