హైదరాబాద్ నుంచి బెంగుళూరు, గోవా(పనాజీ) లకు ఆకాశ ఎయిర్ విమాన సర్వీసులు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. దివంగత స్టాక్ మార్కెట్ దిగ్గజం రాకేష్ ఝున్ఝున్ వాలా ఆలోచల నుంచి రూపు దిద్దుకున్న ఆకాశ ఎయిర్ విమాన సర్వీసులు హైదరాబాద్ నుంచి కూడా ప్రారంభమవుతుండడంతో 14 నగరాల వ్యాప్తంగా మొత్తం 21 రూట్లలో 575 వీక్లీ ఫ్లయిట్స్ ని లాంచ్ చేసినట్టయిందని ఈ సంస్థ కో-ఫౌండర్, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ప్రవీణ్ అయ్యర్ తెలిపారు.
ఫిబ్రవరి 15 నుంచి హైదరాబాద్-బెంగుళూరు మధ్య రెండు అదనపు సర్వీసులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. దక్షిణ భారతంలో తమ విమాన సర్వీసులను పెంపొందించడమే తమ లక్ష్యమన్నారు. ఏవియేషన్ ఇండస్ట్రీ నిపుణుడు వినయ్ దూబేతో కలిసి రాకేష్ ఝున్ఝున్ వాలా గత ఏడాది ఆగస్టులో ఆకాశ ఎయిర్ విమాన సర్వీసులు లాంచ్ చేశారు.
అయితే అదేనెల 14 న ఆయన కన్నుమూశారు. లో కాస్ట్ మోడల్ అయిన తమ ఆకాశ ఎయిర్ విమానాలు రోజులో ఎన్నో గంటలు ప్రయాణిస్తాయని, ఇండిగో, స్పైస్ జెట్ వంటి ఎయిర్ లైన్స్ సంస్థలకన్నా తమ ఆపరేటింగ్ చార్జీలు తక్కువని వినయ్ దూబే వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి తమ విమాన సర్వీసులను బెంగుళూరు, పనాజీ నగరాలకు ప్రారంభిస్తుండడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆకాశ ఎయిర్ విమానాలు 14 ఉన్నాయని, మార్చి నాటికి వీటి సంఖ్యను 18 కి పెంచుతామని అన్నారు. వచ్చే నాలుగేళ్లలో ఈ సంఖ్య 54 కి పెరుగుతుందన్నారు.