చిన్న చిన్న ట్రాఫిక్ చలాన్లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కోరారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన ఈ రోజు మాట్లాడారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను ట్రాఫిక్ పోలీసులు నియంత్రించడం లేదని ఆయన పేర్కొన్నారు.
ట్రాఫిక్ పోలీసులు ఏదో ఒక మూలన కూర్చుని వచ్చి పోయే వాహనాలకు చలాన్లను వేసే పనిలో ఉంటున్నారని ఆయన అన్నారు. పెరిగిన ధరలతో సామాన్య జనం ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వెల్లడించారు. వాళ్ల పై కొంచెం దయ చూపాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
ఇప్పటికే పెరిగిన గ్యాస్ పెట్రోలు డీజిల్ ధరలతో సామాన్య జనం పరేషాన్ అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి నుంచి బయటకు వస్తే ట్రాఫిక్ పోలీసులను చూసి వారు పరేషాన్ అవుతున్నారని చెప్పారు. ఈ ట్రాఫిక్ చలాన్ల వల్ల ఎక్కువగా పేదవాళ్లే ఇబ్బంది పడుతున్నారన్నారు.
చిన్న చిన్న చలాన్లు ఉంటే మాఫీ చేసే ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ ఈ రోజుతో ముగిసింది. రెండురోజులుగా 24 పద్దులపై చర్చించి ఆమోదించారు.ఈ రోజు నీటిపారుదల, సాధారణ పరిపాలన, వాణిజ్యపన్నులు, వైద్యారోగ్యం, ఆర్థిక, పశుసంవర్ధక, హోం, వ్యవసాయ, సహకార, పంచాయతీ రాజ్, రవాణాశాఖ, గవర్నర్-మంత్రిమండలి పద్దులపై చర్చించారు.