వినాయక్ దర్శకత్వంలో “అఖిల్” అనే యాక్షన్ చిత్రం చేసి ఘోరపరాజయం పొందాడు అక్కినేని చిన్నబ్బాయ్ అఖిల్. ఆ తర్వాత ఇలా కాదని అక్కినేని ఫ్యామిలీకి మరచిపోలేని ‘మనం’ సినిమా అందించిన దర్శకుడు విక్రం జతలో హెలో అనే యాక్షన్-లవ్ డ్రామా చేశాడు. పాపం అదీ మళ్ళీ నిరాశనే మిగిల్చింది.
ఆ తర్వాత మరో సో కాల్డ్ లవ్ స్టోరీగా “మిస్టర్ మజ్ఞూ” అంటూ ప్రేక్షకులకు హలో అని చెప్పినా జనం రెస్పాండ్ కాలేదు. ఏం చెయ్యాలో తోచని అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జున ఈసారి ఫ్యామిలీ జానర్‌తో ప్రయత్నించాలని డిసైడ్ అయ్యాడు.
అప్పుడెప్పుడో బొమ్మరిల్లు లాంటి ఫీల్ గుడ్ సినిమా అందించిన భాస్కర్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. పాపం ఈ అక్కినేని వారసుడి సుడి ఏంటో గానీ పూజా హెగ్డే, రష్మికా మందన్నా, సాయి పల్లవి వంటి హీరోయిన్స్ పేర్లు అనుకున్నా ఈ సినిమాలో ఏ ఒక్కరూ నటించడానికి కుదరడం లేదని మొహం చాటేశారు. ఓవైపు సినిమా షూటింగ్ జరుగుతూ ఉన్నా, ఇప్పటివరకు హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాలేదట.
ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పై ఉండగానే “అ”, “కల్కి” వంటి విభిన్న చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్‌వర్మ చెప్పిన ఒక కథ నచ్చి అది చెయ్యడానికి ఒప్పేసుకున్నాడు అఖిల్. ప్రశంత్ ఆ సినిమాలో అఖిల్ కోసం ఓ విభిన్నమైన క్రైం థ్రిల్లర్ స్టోరీని రెడీ చేశాడట. ఇటీవలి కాలంలో ఈ జానర్ సినిమాలు మంచి విజయాలు అందుకుంటూ ఉండటంతో కనీసం ఈ రూపంలోనైనా తనకు ఒక సక్సెస్ దక్కుతుందనే ఆశపెట్టుకున్నాడు అఖిల్. మరో గుడ్‌న్యూస్ ఏంటంటే, ఈ సినిమాకు ముందుగానే జోడీని ఫైనల్ చేసేశారట. కేరళ కుట్టి నివేదా థామస్ ఈ సినిమాలో అఖిల్‌తో జత కట్టనుంది.