సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో పార్టీకి చెందిన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు ఆయన ఆదివారం ప్రకటించారు. యూత్, మహిళా విభాగాల కమిటీలు కూడా ఇందులో ఉన్నట్టు ఆయన వెల్లడించారు.
ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. అయితే కమిటీల రద్దు నిర్ణయానికి గల కారణాలను ఆయన వెల్లడించలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు నూతన కమిటీలను నియమించాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఎస్పీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తో పాటు, రాష్ట్ర ఎస్పీ అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్ మాత్రం పదవిలో కొనసాగుతారని పార్టీ పేర్కొంది. ఈ మేరకు అఖిలేశ్ యాదవ్ ఆదేశాలు జారీ చేసినట్టు సమాజ్ వాద్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.
2024 లోక్ సభ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఎస్పీ నిర్ణయించింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీపై విజయం సాధించాలని అఖిలేశ్ పట్టుదలతో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతం చేయాలని అఖిలేశ్ నిర్ణయం తీసుకున్నారు.