మోడీ సర్కార్‌పై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలను బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. సమాజ్ వాదీ పార్టీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలను కోల్ కతాలో నిర్వహించనున్నారు.
ఈ క్రమంలో ఆయన కోల్ కతాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖలు బీజేపీకి రాజకీయ ఆయుధాలని ఆరోపించారు.
యూపీలో తమ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలపై బీజేపీ తప్పుడు కేసులు పెడుతోందన్నారు. బెంగాల్ లో అలాంటి ఘటనలు తక్కువ అని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే పార్టీలపైకి ఈడీ సీబీఐలను ఆ పార్టీ పంపుతోందన్నారు.
సమాజ్ వాదీ పార్టీ జాతీయ కార్య వర్గ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పార్టీ విధానాలు, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ రోజు మౌలాలీ యువ కేంద్రలో నిర్వహించే సమావేశంలో ఎస్పీ చీఫ్ పాల్గొననున్నారు.