దేశంలో పెట్రోల్ ధరల పెంపు కొనసాగుతోంది. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం మరోసారి పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలపై లీటరుకు 80 పైసలను చమురు కంపెనీలు పెంచాయి. గత 12 రోజుల్లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది 10వ సారి గమనార్హం.
పెట్రోల్ ధరల పెంపుపై కేంద్రాన్ని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. ప్రతి రోజూ 80 పైసలు లేదా నెలకు రూ. 24 చొప్పున పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉంటే వచ్చే నవంబర్-డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే నాటికి దాదాపు ఏడు నెలల్లో రూ. 175 వరకు పెరుగుతుందని ప్రజలు అంటున్నారని తెలిపారు.
ఈరోజు లీటరు రూ. 100కు అమ్ముడవుతున్న పెట్రోలును ఎన్నికల నాటికి రూ. 275కి విక్రయిస్తారని అన్నారు. ఇది బీజేపీ ద్రవ్యోల్బణ గణితం అంటూ అఖిలేశ్ ట్వీట్ చేశారు.
గత నెలలో గ్యాస్ ధరలు పెరిగిన సందర్భంలోనూ కేంద్రంపై అఖిలేశ్ నిప్పులు చెరిగారు. గ్యాస్ ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణ మరో గిఫ్ట్ అంటూ ఆయన అభివర్ణించారు.