ఎక్కడో మారు మూల్లెటూరు. ఓ నలుగురు కుర్రాళ్ళే రచయితలై.దర్శకులై, నిర్మాతలై , నటులై నిర్మించుకున్న కామెడీ షో..“మై విలేజ్ షో”. ఎంతో మందిని విశేషంగా ఆకట్టుకుంది. అదే విలేజ్ షో ద్వారా కుర్రకారుని అమితంగా ఆకట్టుకున్న అరవయ్యేళ్ళ సహనటీమణి గంగవ్వ.
స్వచ్ఛమైన పల్లెటూరి మట్టిమనిషిలా…అల్లరి చిల్లరిగా తిరిగే తనకొడుకు వయసున్నకుర్రాళ్ళని, మనవల వయుసున్న పిల్లలని తన పెద్దరికంతో శుద్దులు నేర్పి,తనదైన శైలిలో బెత్తం దెబ్బలు వేసి గాడిన పెట్టే క్యారెక్టర్. ఈ పాత్ర ..ఆ మనిషి..ఆ నటి తెలుగురాష్ట్ర ప్రజల్ని కట్టిపడేసింది.వెరసి తెలుగు ఎటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి ఓ మట్టిలో మాణిక్యం పరిచయం అయ్యింది.
నటిగా ,బిగ్ బాస్-4 ..కంటెస్టెంట్ గా రెండు రాష్ట్రాల్లోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు గంగవ్వ. ఇటీవల ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బిగ్ బాస్ రెమ్యూనరేషన్ వివరాలు, నాగార్జున తనకు చేసిన ఆర్థిక సాయాన్ని ఇందులో తెలిపారు.
బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్‌గా వెళ్లిన గంగవ్వ మధ్యలోనే ఎలిమినేట్ అయ్యారు. దాదాపు ఐదు వారాల పాటు హౌస్ లో ఉన్నారు. బిగ్ బాస్ హౌసులో తినడం పడుకోవడం తప్ప వేరే పని లేకపోవడంతో ఇబ్బంది పడ్డట్లు చెప్పారావిడ.
హౌస్ లోపలికి పంపించే ముందు 15 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచడమూ తనను ఇబ్బందికి గురిచేసిందన్నారు. దీంతో మధ్యలోనే ఎలిమినేషన్ రూపంలో బయటకు వచ్చేశానని చెప్పారు. ఐదు వారాల పాటు హౌస్ లో ఉన్నందుకు బిగ్ బాస్ వాళ్లు తనకు రూ.10 లక్షలు ఇచ్చారని గంగవ్వ తెలిపారు.
ఎలిమినేషన్ వేదికపై నాగార్జునతో మాట్లాడుతూ.. ఇల్లు కట్టుకోవాలనే కోరికను గంగవ్వ వెలిబుచ్చారు. దీంతో బిగ్ బాస్ ఇచ్చే రెమ్యూనరేషన్ కాకుండా తాను వ్యక్తిగతంగా గంగవ్వకు సాయం చేస్తానని నాగార్జున ప్రకటించారు. అన్నట్లుగానే నాగార్జున సాయం చేయడం, బిగ్ బాస్ వాళ్లు ఇచ్చిన డబ్బుతో గంగవ్వ ఇల్లు పూర్తయింది.
అయితే, గంగవ్వ ఇంటికోసం నాగార్జున ఎంతిచ్చారనే విషయం ఇప్పటి వరకూ బయటపెట్టలేదు. అటు నాగార్జున కానీ, ఇటు గంగవ్వ కానీ ఈ విషయంలో నోరు మెదపలేదు. తాజాగా, నాగార్జున తనకు ఇచ్చిన సొమ్ము ఎంతో గంగవ్వ చెప్పేశారు. రూ. 7 లక్షలు ఇచ్చారని వెల్లడించారు. బిగ్ బాస్ హోస్ట్, హీరో నాగార్జున సాయంతో తన సొంతింటి కల నెరవేరిందని గంగవ్వ ఆనందం వ్యక్తం చేశారు.