మన దేశంలో రాముడిని దేవుడిగా కొలుస్తారు. ఆయన విరోధి అయిన రావణుడిని రాక్షసుడిగానే చూస్తారు. దసరా రోజున రావణదహనం కూడా నిర్వహిస్తారు.కానీ మన దేశంలోని మహారాష్ట్రలోని అకోలా జిల్లా సంగోలా గ్రామంలో రావణున్ని గొప్ప దేవునిగా పూజిస్తారు.
దసరా రోజు దేశమంతటా రావణదహనం చేస్తే… ఈ ప్రాంతంలో మాత్రం హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అంతేకాదు… ఆ గ్రామం మధ్యలో 10 తలలతో రావణుడి ఎత్తైన విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. అయితే దాదాపు కొన్ని శతాబ్దాల నుంచి ఆ విగ్రహానికి పూజలు చేస్తూ ఆనందంగా ఉంటున్నారు.
ఈ విగ్రహాన్ని చూడటానికి పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు కేవలం రావణుడి దయతోనే సంతోషంగా జీవిస్తున్నామని పేర్కొంటున్నారు.ఆ లంకాధీశుడి ఆశీర్వాదంతోనే వారందరికీ జీవనోపాధి కలిగిందని భావిస్తున్నారు.
ఆ ప్రాంతం మొత్తం సంతోష జీవితం గడపడానికి ఆయనే ముఖ్య కారకుడు అని నమ్ముతారు. అంతేకాదు… ఆయన్ని పండితుడిగా కూడా భావిస్తారు. అయితే కొన్ని కారణాల వల్ల మాత్రమే సీతమ్మను అపహరించి ఆమె పవిత్రతను కాపాడాడని అక్కడి వారు విశ్వసిస్తారు.విచిత్రం ఏంటంటే అక్కడ రావణుడితో పాటు రాముడిని కూడా పూజిస్తారు.