మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి పోలీసులు ఈ నెల 20న ఇద్దరిని అరెస్టు చేశారు. కేవలం 23 ఏళ్ళ అర్బాజ్ ఖాన్ అనే యువకుడు ఈ హింసకు ప్రధాన సూత్రధారి అని వారు తెలిపారు. తన ఇన్స్ టా గ్రామ్ చాట్ ద్వారా ఈ ప్రాంతంలో మతపరమైన ఘర్షణలు రేగడానికి ఈ యువకుడు కారణమయ్యాడన్నారు. ఘర్షణలను ప్రేరేపించేందుకు అర్బాజ్ ఖాన్ … ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని ‘ఆయుధం’గా ఎంచుకున్నాడని వారు చెప్పారు.
అకోలా లో ఈ నెల 13 న జరిగిన హింసలో మతపరమైన ఘర్షణలు జరిగి రాళ్లు రువ్వుకోవడం వంటి ఘటనలు జరిగాయి. అల్లర్లలో ఒకరు మరణించగా 8 మంది గాయపడ్డారు. అర్బాజ్ ఖాన్ వివాదాస్పదమైన, వక్రీకరించిన వ్యాఖ్యలను తన ఇన్స్ టా గ్రామ్ చాట్ లో వైరల్ చేయడమే ఇందుకు కారణమైందని పోలీసులు తెలిపారు
ఇక సమీర్ సోనావానే అనే మరో వ్యక్తి… ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు సంబంధించి ఓ ఇన్స్ టా గ్రామ్ పేజ్ ని క్రియేట్ చేసి అందులో తన భావాలను జొప్పించాడని, ఇది చూసిన అర్బాజ్ ఖాన్ అతనితో మాటలు కలిపి చాట్ చేయడం ప్రారంభించాడన్నారు. ఓ దశలో ఇద్దరి మధ్య ఇది మతపరమైన వాగ్యుధ్ధానికి దారి తీసినట్టు తెలుస్తోంది.
అర్బాజ్.. తమ మధ్య జరిగిన కొన్ని చాటింగులను తన ఇన్స్ టా గ్రామ్ లో పోస్ట్ చేశాడని, దాంతో ఇది ఇంకా రాజుకుందని, పెద్ద సంఖ్యలో ఒకవర్గం వారు నగరమంతా అల్లర్లకు దిగారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. వారు సమీర్ సోనావానేను కూడా అరెస్ట్ చేశారు. అకోలాలో నాడు ఇంటర్నెట్ సర్వీసులను కూడా రద్దు చేసి కర్ఫ్యూ విధించారు.