తమిళ్ లో సూరారై పొట్రు.. తెలుగులో ఆకాశమే నీ హద్దురా. సూర్య హీరోగా నటించిన ఈ సినిమా ఓటీటీలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు స్టార్ హీరోలు పోటీపడ్డారు. ఎట్టకేలకు ఈ రేసులో అక్షయ్ కుమార్ విజేతగా నిలిచాడు. అవును.. ఆకాశమే నీ హద్దురా హిందీ రీమేక్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటించబోతున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితం, కెరీర్ ఆధారంగా తెరకెక్కింది ఆకాశం నీ హద్దురా. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తాజాగా ఆస్కార్ బరిలోకి కూడా ఎంటరైంది. ఇవన్నీ పక్కనపెడితే.. నార్త్ ఆడియన్స్ కు కూడా బాగా కనెక్ట్ అయ్యే కథ కావడంతో బాలీవుడ్ హీరోలు ఈ రీమేక్ చేయడానికి ఆసక్తి చూపించారు.
హృతిక్ రోషన్, షారూక్ ఖాన్, జాన్ అబ్రహాం లాంటి హీరోలు ఈ రీమేక్ కోసం ప్రయత్నించారు. ఫైనల్ గా ఆ అవకాశం అక్షయ్ కుమార్ ను వరించింది. లవ్, ఎమోషన్, డ్రామా, థ్రిల్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ కథలో. పైగా రియల్ లైఫ్ స్టోరీ. ఇలాంటి నిజ జీవిత కథలకు బాలీవుడ్ జనాలు పట్టం కడతారు. అందుకే ఆకాశం నీ హద్దురా సినిమా హిందీలో హాట్ కేక్ అయింది.
హిందీ వెర్షన్ కు కూడా సుధా కొంగరే దర్శకత్వం వహించనున్నారు. తమిళ వెర్షన్ కు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా.. హిందీ వెర్షన్ కు మరో సంగీత దర్శకుడ్ని అనుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం ఉంది.