భారత చిత్రసీమలో కొంతకాలం నుంచి సౌత్ vs నార్త్ పోరు జరుగుతోంది. ముఖ్యంగా.. జాన్ అబ్రహం బాలీవుడ్ ఎప్పటికీ నం. 1 అని చేసిన వ్యాఖ్యలు, ఈ వార్ కి బీజం పోసింది. అప్పట్నుంచి సెలెబ్రిటీలు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అక్షయ్ కుమార్ మాత్రం చిత్ర పరిశ్రమలన్నీ ఒక్కటేనన్న నినాదానికి తెరలేపారు. ప్రస్తుతం తన పృథ్వీరాజ్ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్న ఈ స్టార్ హీరో.. బాలీవుడ్ & సౌత్ అంటూ లేవని.. దయచేసి సౌత్ vs నార్త్ పోరుని సృష్టించొద్దని కోరారు.
మనమంతా భారతీయులమనే విషయాన్ని నటులెవరూ మరిచిపోవద్దని అన్నారు అక్షయ్ కుమారు, ఇండియన్ సినిమా అనే ఇండస్ట్రీ ఒక్కటే ఉందని అక్షయ్ చెప్పారు. ఇక ఇదే సమయంలో పుష్ప సినిమా బాలీవుడ్ పై చేసిన దండయాత్ర గురించి మాట్లాడారు. మన ఇండస్ట్రీకి పుష్ప సినిమా రూపంలో ఓ పెద్ద విజయం దక్కిందన్నారు. అలాగే.. బన్నీతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయడానికి కూడా తాను సిద్ధంగానే ఉన్నానని వ్యాఖ్యానించారు.
మంచి కథతో ఓ దర్శకుడు ముందుకొస్తే.. బన్నీతో కలిసి సినిమా చేస్తానన్నారు అక్షయ్. కేవలం బన్నీతోనే కాదు.. సినీ ప్రియుల్ని అలరించడం కోసం తాను ఏ సౌత్ స్టార్ హీరోతోనైనా సినిమా చేసేందుకు రెడీగా ఉన్నానని వెల్లడించారు.
ఈమధ్య సౌత్ సినిమాలు జాతీయంగా సత్తా చాటుతున్న తరుణంలో.. బాలీవుడ్ బడా హీరోలందరూ దక్షిణాది సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆల్రెడీ సల్మాన్ ఖాన్.. మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్షయ్ ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో.. అక్షయ్ కోసం మన ఫిల్మ్ మేకర్స్ ఏదైనా కథ సిద్ధం చేస్తారా..? లేదా..? అనేది వేచి చూడక తప్పదంటున్నారు సీనీ ప్రముఖులు.