పోలీస్ ఎస్సై, కానిస్టేబుల్ దేహదారుడ్య పరీక్షల్లో మార్పులపై ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా గ్రూప్-2 నోటిఫికేషన్‌లో ఎక్సైజ్ ఎస్సై అభ్యర్థులకు నిర్ణీత ఎత్తు, ఛాతీ కొలతలను పెంచింది. ఈ క్రమంలో ప్రభుత్వంపై సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని మెదడు తక్కువ నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. పెంచిన శారీరక ప్రమాణాలకు ఎక్సైజ్ ఎస్ఐ పనికి ఏదైనా సంబంధం ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం పేద కుటుంబాల అభ్యర్థుల పట్ల వివక్ష చూపించడమేనన్నారు.
అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని ప్రభుత్వానికి ఆయన సూచించారు. గతంలో ఎక్పైజ్ ఎస్సై పోస్టులకు ఎత్తు 165 సెంటిమీటర్లు ఉండేది. కానీ తాజా నోటిఫికేషన్‌లో దాన్ని 167.6 సెంటీమీటర్లకు పెంచింది. అలాగే ఇప్పటి వరకు ఛాతి పరిమాణం 81 సెంటీమీటర్లు ఉండాలనే నిబంధన ఉండేది.
దాని బదులుగా ఛాతీ కొలతలు 5 సెంమీలు పెంచి 86.3కు తీసుకు వచ్చారు. సర్కార్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక లాంగ్ జంప్, షార్ట్ పుట్ వివాదంపై ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్నారు.