– అట్టహాసంగా మన ఊరు-మన బడి ప్రారంభం
– స్కూల్స్ రూపురేఖలు మారుస్తామన్న సీఎం
– 8 ఏళ్లుగా ఏం చేశారని ప్రశ్నిస్తున్న ప్రజలు
– రాష్ట్రంలో పేదలకు విద్య దూరం అవుతుందా?
– బడ్జెట్ కేటాయింపులే గానీ.. ఖర్చు జరగడం లేదా?
– ఇప్పటిదాకా జరిగిన కేటాయింపులెన్ని? ఖర్చుఎంత?
– వివరాలతో సహా బయటపెట్టిన ఆకునూరి మురళి
వనపర్తి పర్యటనలో భాగంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని తెలిపారు. త్వరలో చక్కటి వసతులు రాబోతున్నాయని.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రారంభం అవుతుందని నాలుగు ముక్కలు చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కేసీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో విశ్లేషకులు పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. భవిష్యత్తులో పాఠశాలల రూపురేఖలు మారిపోతాయని చెబుతున్న కేసీఆర్.. ఇన్నాళ్లూ ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. ఈ 8 ఏళ్ల కాలంలో రాష్ట్రంలోని ఎన్ని స్కూల్స్ రూపురేఖలు మార్చారో చెప్పాలని నిలదీస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో వివరిస్తూ కేసీఆర్ కు చురకలంటిస్తున్నారు. ఈమధ్యే హన్మకొండ జిల్లా హసన్ పర్తి జెడ్పీ హైస్కూల్ లో పైకప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థులకు గాయాలయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఈ సందర్భంగా బడ్జెట్ కేటాయింపులపైనా చర్చ నడుస్తోంది. విద్యా రంగం కోసం రూ.7,289 కోట్లను కేటాయించినా.. అందులో ఖర్చు చేసేది ఎంత అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు విశ్లేషకులు. తొలివెలుగుతో మాట్లాడిన రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఇదే విషయంపై వివరించారు. చాలా రోజులుగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని గమనిస్తున్నామని.. స్వయంగా జిల్లాల్లో పర్యటించి చూస్తున్నామన్నారు.
బడ్జెట్ లో కేటాయింపులు చేయడమే గానీ.. అదే స్థాయిలో ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టదని చెబుతున్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా విద్యారంగంపై బడ్జెట్ లో కేటాయింపులు, ఖర్చులపై ఓ గ్రాఫ్ చాట్ ను ఆయన విడుదల చేశారు. అందులో 2014 నుంచి విద్యాశాఖకు పెడుతున్న ఖర్చు చాలా దారుణంగా పడిపోతూ వస్తోంది. కనీసం ఈసారి బడ్జెట్ లో మన ఊరు-మన బడి ప్రస్తావనే లేదని మండిపడ్డారు మురళి.
తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తుందనడానికి ఇంతకంటే చక్కటి ఉదాహరణ ఏముంటుందని అన్నారు. ఇప్పటిదాకా 7 జిల్లాల్లో పర్యటించామని.. చాలా స్కూళ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని విమర్శించారు ఆకునూరి మురళి. ఓ స్కూల్ లో అయితే.. ఒకప్పుడు వెయ్యి మంది ఉన్న విద్యార్థులు.. ఇప్పుడు 40 మందికి పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం టాయిలెట్స్ కూడా లేని స్కూల్స్ ఈ రాష్ట్రంలో ఉన్నాయని.. కొన్నిచోట్ల నిజాం కట్టిన భవనాల్లోనే పాఠాలు చెబుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం విద్యావ్యవస్థను నడిపించాలంటే ఏడాదికి రూ.83,800 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు మురళి. బడ్జెట్ లో కేటాయించేవి శాలరీల కోసమేనని అభిప్రాయపడ్డారు.