సైకో సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి కుటుంబ సభ్యులను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి వారి స్వగ్రామంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన ప్రీతికి నివాళులు ఆర్పించారు. ఆయనతో పాటు ఎస్ డీఎఫ్ కో కన్వీనర్ డాక్టర్ పృథ్వీరాజ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రీతి ఆత్మహత్య చేసుకునేంత పిరికి పిల్ల కాదని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.
ఫిబ్రవరి 22 ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఏదో మిస్టరీ జరిగినట్లు తెలుస్తోంది. ముందు రోజు రాత్రి 10 గంటలకు తన తండ్రితో మాట్లాడినప్పుడు కానీ, ఉదయం 3 గంటల సమయంలో ఓ సీనియర్ విద్యార్థితో మాట్లాడినప్పుడు కానీ ప్రీతి మామూలుగానే ఉంది. కానీ పొద్దున్నే ఆరు గంటలకు ఎలా ఆత్మహత్య చేసుకుంటుందని వారు ప్రశ్నించారు.
ప్రీతిని ఐసీయూలో చేర్చిన తరువాత రెండు గంటల వరకు ఎందుకు తండ్రికి ఫోన్ చెయ్యలేదని ఆకునూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రీతి తండ్రి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే పోలీస్ స్టేషన్ లోనే డ్యూటీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎంజీఎం అధికారులు తెలిపినట్లు ప్రీతికి కానీ, సైఫ్ కి కానీ వేధింపుల గురించి ఎవ్వరు కౌన్సిలింగ్ చెయ్యలేదని ఆయన తెలిపారు.
హెచ్‌వోడీ డాక్టర్ నాగార్జున రెడ్డి ప్రీతిని మాత్రమే పిలిచి ఈ విషయం గురించి నువ్వెందుకు అందరికీ చెబుతున్నావని మందలించినట్లు ప్రీతి తన తల్లిదండ్రులకు చెప్పింది. ఇది కౌన్సిలింగ్ ఎలా అవుతుందని ఆయన నిలదీశారు. కుటుంబ సభ్యులు దీనిని ఆత్మహత్యగా పరిగణించడం లేదని ఆయన పేర్కొన్నారు. ముమ్మాటికీ ఇందులో ఎదో గడబిడ ఉంది అని నమ్ముతున్నారు. నిజానిజాలు బయటకు తీసి ఇలాంటి క్షోభ ఇంకెవరికి రావొద్దని కోరుకుంటున్నారు.
ఎస్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్లు చేసింది. అవి ఏంటంటే.. తక్షణమే ప్రభుత్వము జ్యూడిషల్ ఎంక్వయిరీ వేసి నిజానిజాలు బయటకు తియ్యాలి. ప్రభుత్వ శాఖల మీద నమ్మకం లేదని కుటుంబసభ్యులు అంటున్నారు. యాంటీ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ దీని గురించి పూర్తిగా బాధ్యతలు తీసుకోవాలి.
తక్షణమే హెచ్‌ఓడీ నాగార్జున రెడ్డిని, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర రెడ్డిని ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ ని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలి అని డిమాండ్ చేశారు . జ్యూడిషరీ ఎంక్వయిరీ ద్వారా నిందితులను గుర్తించి చట్టాల ప్రకారం శిక్షించాలి అని కోరారు. ప్రీతి కేసును హైకోర్టు సుమోటో గా చేపట్టాలని కోరుతున్నాం.
టీచింగ్ ఆస్పత్రులలో జూనియర్ డాక్టర్ల / సీనియర్ రెసిడెంట్ల పని వ్యవస్థను, వారికి మార్కులు వేసే పద్దతిని పాస్ చేసే పద్దతులను పరిశీలించి పారదర్శకత వ్యవస్థను పెట్టాలని పేర్కొన్నారు . ఇప్పుడు ఉన్న పరిస్థితులు PG స్టూడెంట్లు ఫ్యాకల్టీ కింద ఒక బానిస బతుకులలా భయం భయం గా బతుకుతున్నట్టు కనపడుతుందన్నారు. ప్రీతి తండ్రి కూడా ఇదే అభిప్రాయం తో ఉన్నారని స్పష్టం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమయిన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని వారు కోరారు.