మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగొడ్ పాఠశాలను శనివారం సోషల్ డెమోక్రటిక్ ఫోరం స్టేట్ కన్వీనర్, ఏపీ ప్రభుత్వ సలహాదారు, ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సందర్శించారు. స్కూల్ పక్కన జేసీబీ గుంతలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన నేపథ్యంలో ఆయన పాఠశాలకు వెళ్లారు.
విద్యార్థులు పడిన గుంతలోనికి దిగి ఆయన పరిశీలించారు. దానితో పాటు పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని కూడా ఆయన చూశారు.పాఠశాలలో ఉన్న మరుగుదొడ్లు, టాయిలెట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు…
సోషల్ డెమోక్రటిక్ ఫోరం తరుఫున పాఠశాలను సందర్శించాం. ఇద్దరు విద్యార్థులు చనిపోవడం అనేది బాధాకరమైన విషయం. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. కేసీఆర్ ఈ విషయం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
తెలంగాణలో ఉన్న 28వేల పాఠశాలలు కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటి గురించి పట్టించుకోకుండ లక్షల కోట్ల రూపాయలు వృథాగా ఖర్చు చేస్తున్నారన్నారు. రైతు బంధు పేరిట విదేశాల్లో ఉన్న కోటీశ్వరులకు కూడా డబ్బులు ఇస్తున్నారు. కాళేశ్వరం పేరిట కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
వాటికి అన్నింటికి వృథాగా డబ్బులు తగాలేస్తున్నప్పుడు… ఎందరో భవిష్యత్తుకు పునాదులు వేసే పాఠశాలలను మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చనిపోయిన ఇద్దరు విద్యార్థుల చావు కచ్చితంగా ప్రభుత్వ హత్యలే అని ఆయన పేర్కొన్నారు.
పాఠశాలల్లో ఉండాల్సిన కనీస మౌలిక వసతులు ఏవి కూడా విద్యార్థులకు అందుబాటులో లేవని ఆయన అన్నారు. ఎందరో సంస్కారవంతులు తయారు కావాల్సిన పాఠశాలల్లో ఎందుకు నాణ్యమైన విద్యను అందించడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. ఇంకా ఎంత మంది పిల్లలు చనిపోయాక ప్రభుత్వం కళ్లు తెరుస్తుందో చెప్పాలంటూ ఆయన నిలదీశారు.