రాష్ట్ర బడ్జెట్‌ను సవరించి 10 వేల కోట్ల నిధులను మన ఊరు మన బడి పథకానికి కేటాయించాలని సోషల్ డెమోక్రాటిక్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ విశాంత్ర ఐఏఏస్ ఆకునూరి మురళి డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఎస్‌డీఎఫ్ చేపట్టిన బడి నిద్ర కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాలజీనగర్, జవహర్‌నగర్, దమ్మాయిగూడా, చెన్నూరు ప్రాథమిక పాఠశాలలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ఊరు మన బడి పథకం మొక్కుబడిగా తయారైందని, ఈ పథకానికి రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా పాఠశాలలో మౌలిక వసతులు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. జవహర్‌నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 36 మంది ఉపాధ్యాయులకు బదులు కేవలం 17 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారన్నారు. చెన్నూర్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరిందని, కనీసం మరమ్మతులు కూడా చేయించకపోవడం దారుణమని ఆయన అన్నారు. దమ్మాయిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని, తరగతి గదులలోకి వాసన వస్తుందని, నీటి సరఫరా కూడా లేదని మురళి ఆందోళన వ్యక్తం చేశారు.
మన ఊరు మన బడి పథకానికి సరిపడా నిధుల కేటాయించి నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అలాగే అన్ని బడులను మన బడి పథకంలో రెండు సంవత్సరాలలో చేపట్టాలని ఎస్‌డీఎఫ్ డిమాండ్ చేస్తుందని తెలిపారు. మూడు నాలుగు సంవత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యా బోధన చేపట్టి వారిలో సామర్ధ్యం పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ కె.లక్ష్మీనారయణ, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, వెంకట్ మరోజు, డాక్టర్ ప్రధ్వీరాజ్, పి.శంకర్, స్వరూప,పులి కల్పన, కిరణ్, లక్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.