వరల్డ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, సెప్టెంబర్ 11 పేలుళ్ల సూత్రధారి, ఆల్ ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా సైన్యం మట్టుపెట్టింది. కాబూల్ లో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో జవహరి మరణించారు.

సెప్టెంబర్ 11 దాడులకు జవహరి ప్రణాళికలు రచించాడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అతని మరణంతో చివరకు న్యాయం జరిగిందని బైడెన్ పేర్కొన్నారు.
మరోవైపు కాబూల్ లో ఓ నివాసంపై వైమానిక దాడి జరిగినట్టు తాలిబాన్ ప్రతినిధి వెల్లడించారు. షేర్పా ప్రాంతంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయని ఆయన చెప్పారు.
ఈ దాడులు అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించాయని ఆయన పేర్కొన్నారు. దీంతో ఆల్ జవహరి మరణ వార్తలకు బలం చేకూరింది.
ఒసామా బిన్ లాడెన్ ను 2011లో అమెరికా దళాలు మట్టుపెట్టాయి. ఆ తర్వాత ఆయన స్థానంలో అల్ ఖైదా పగ్గాలను జవహరి స్వీకరించారు.
సెప్టెంబర్ 11న అమెరికాలో ట్విన్ టవర్స్ పై దాడుల సూత్రదారుల్లో అల్ జవహరి ఒకరని అమెరికా గుర్తించింది. అప్పటి నుంచి జవహరిని హతమార్చేందుకు అమెరికా ప్రయత్నాలు చేసింది. తాజాగా కాబూల్ లో జవహరిని అమెరికా మట్టుపెట్టింది.