దేశంలో మరో ఉగ్రకుట్ర బయటపడింది. అసోంలో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆల్ ఖైదాతో పాటు గ్లోబల్ టెర్రర్ సంస్థలతో వీరికి సంబంధం ఉన్నాయనే ఆరోపణలపై వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇటీవల బిహార్ లో పీఎస్ఐ ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా అసోంలో మరో కుట్రను వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. అరెస్టైన వారిలో ఒకరు మదర్సాలో టీచర్ గా పనిచేస్తున్నారు.
నిన్నటి నుంచి ఈ రోజు వరకు అసోంలోని మోరీగావ్, బార్ పేట జిల్లాల్లో రెండు ఉగ్రకుట్రలను భగ్నం చేసినట్టు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. వీరందరికీ జిహాదీ మాడ్యూల్స్ తో సంబంధం ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.
పట్టుబడిన వారిలో ముస్తపా అలియాస్ ముఫ్తీ ముస్తాఫా మోరిగావ్ జిల్లాలోని సహారియాలో మదర్సా నడుపుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. అన్సరుల్లా బంగ్లా జట్టులో కీలక సభ్యునిగా ముస్తఫా ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు.
ముస్తఫా మదరసాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పుడు తున్నాడని, ఉగ్ర సంస్థలకు నిధులు చేకూరుస్తున్నాడని పోలీసులు తెలిపారు. ముస్తఫాతో పాటు అబ్బాస్ అలీ, అఫ్సరుల్లా భుయాన్, జుబైర్ ఖాన్ , మోహబూబుర్ రెహమాన్, రఫీకుల్ ఇస్లాం, దేవాన్ హమీదుల్ ఇస్లాం, కాజీబుర్ హుస్సేన్, షాహనూర్ అస్లాం, ముజిబౌర్ రెహమాన్, సహజహాన్ అలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.