మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. వివాదం చెలరేగుతుందని అధిష్టానం ముందుగా దీన్ని గ్రహించి వారిపై చర్యలు తీసుకున్నా.. గొడవ సద్దుమణగడం లేదు. ముస్లిం దేశాలు, బీజేపీ వ్యతిరేక వర్గాలు కేంద్రాన్ని టార్గెట్ గా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా విడుదల చేసిన లేఖ సంచలనంగా మారింది.
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది అల్ ఖైదా. బీజేపీ మాజీ అధికార ప్రతినిధులు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలను ఖండిస్తూ.. దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామని స్పష్టం చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దర్నీ చంపేస్తామని లేఖలో పేర్కొంది.
ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్ లలో దాడులకు దిగుతామని తెలిపింది అల్ ఖైదా. “మేము, మా పిల్లలు ఒంటినిండా పేలుడు పదార్థాలతో వారిని పేల్చేస్తాం. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్ లలో ఉన్న కాషాయ ఉగ్రవాదులు చనిపోయేందుకు సిద్ధంగా ఉండండి” అని హెచ్చరికలు జారీ చేసింది. ఇటు మరో ఉగ్ర సంస్థ ఎంజీహెచ్ కూడా నూపుర్ శర్మ క్షమాపణ చెప్పాలని లేదంటే ఏం చేయాలో అది చేస్తామని టెలిగ్రామ్ లో వార్నింగ్ ఇచ్చింది.
మరోవైపు కొన్ని ముస్లిం దేశాలు ఈ విషయంలో పట్టువిడవకపోవడంతో భారత దౌత్య అధికారులు చర్చలు జరుపుతున్నారు. కొంతమంది వ్యక్తుల వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదని చెబుతున్నారు. సర్వ మతాలను గౌరవించడం భారతీయ సంస్కృతిలోనే ఉందని గుర్తు చేస్తున్నారు.