అమెరికాను ఆల్ ఖైదా మళ్లీ టార్గెట్ చేయబోతుందా…? ఆఫ్ఘనిస్థాన్ నుండే ఆల్ ఖైదా దాడులకు ప్లాన్ చేస్తుందా…? ఆఫ్ఘన్ నుండి అమెరికా దళాలు వెళ్లిపోయాక… ఉగ్రవాదులు రగిలిపోతున్నారా…? ఆల్ ఖైదాకు తాలిబన్ల సర్కార్ ఫుల్ సపోర్ట్ ఇస్తుందా…? అంటే అమెరికా నిఘా అధికారులు అవుననే అంటున్నారు.
రాబోయే రెండు సంవత్సరాల్లో అమెరికాపై దాడులకు ఆల్ ఖైదా సన్నాహకాలు చేస్తుందని డిఫెన్స్ ఇంటలిజెన్స్ డైరెక్టర్ జనరల్ స్కాట్ బారియర్ కామెంట్ చేశారు. అవసరం అయితే తిరిగి ఆఫ్ఘన్ వెళ్లేందుకు తాము సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే, అన్ని అంశాలను బేరీజు వేసుకొని… దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆల్ ఖైదా తన కార్యక్రమాలను ఇప్పటికే మొదలుపెట్టినట్లు అమెరికా ఇంటలిజెన్స్ వ్యవస్థకు పక్కా సమాచారం ఉందని మరో ఉన్నతాధికారి తెలిపారు.
ఇంటలిజెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అలయన్స్ సంస్థ ఆద్వర్యంలో వాషింగ్టన్ లో జరిగిన సమావేశంలో ఇద్దరు ఉన్నతాధికారులు ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. అవసరం అయితే డ్రోన్ అటాక్స్ చేసేందుకు కూడా రెడీగా ఉన్నట్లు తెలిపారు. సోమాలియా, సిరియా, ఇరాక్, యేమెన్ నుండి అమెరికాకు భారీ ప్రమాదం ఉన్నట్లు అమెరికా అనుమానిస్తుంది. అయితే ఆల్ ఖైదా అడుగులను జాగ్రత్తగా గమనిస్తూ తిప్పికొట్టేందుకు అమెరికా రెడీగా ఉందని తెలిపారు.