మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల సక్సెస్ రేటు ఎలా ఉన్నా డైలాగ్స్ మాత్రం దుమ్ము దులుపుతాయి. సగం అతని సినిమా డైలాగ్స్ మీదే ఆడేస్తుంటుంది. అందులో అతనికి ఎప్పటికీ రిమార్కులుండవు. కాకపోతే, తన సినిమాల్ని తనే కాపీ కొట్టుకుని కథ అల్లుకోవడం ఒక్కటే తన దగ్గర ఓ బలహీనత అని అనుకోవచ్చు. దాదాపు ప్రతి సినిమాలోనూ ఇద్దరు అక్కాచెల్లెళ్లు..అక్కతో రొమాన్స్ చేసి చెల్లిని పెళ్లాడటం.. వగైరా వగైరా! నిజానికి తన సినిమాలన్నీ దాదాపుగా వేరే ఏదో ఒక సినిమా చూసి ప్రేరణ పొంది రాసుకున్నట్టుగానే అనిపిస్తాయ్. వాటికీ ఆధారాలు కూడా ఉన్నాయ్. అఆ మూవీ విజయనిర్మల మీనా సినిమా యాజిటీజ్‌గా తీసుకున్నది. అందులో సీన్ టు సీన్ ఏమార్పూ వుండదు.
కాపీ.. అనేది ఏమంత పెద్ద నేరం కాదు. ప్రేరణ వరకు ఓకే, కానీ మక్కీకి మక్కీ దించే కాపీలయితేనే సమస్య. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమా కూడా ఇదే లిస్టులో చేరుతుందా ఏమిటి ? ఈ సందేహం ఎందుకొచ్చిందంటే.. వైకుంఠపురం సిన్మా స్టోరీ ఇదేనంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇదే కనక నిజమైతే, త్రివిక్రమ్ మరోసారి ప్రేరణ పొందాడని మనం అర్ధం చేసుకోవచ్చు.
అలా చక్కర్లు కొడుతున్న ‘అల వైకుంఠపురంలో..’ సినిమా స్టోరీ ఏంటంటే… జయరాం అండ్ మురళీశర్మ అనే క్యారెక్టర్ల నుంచి కథ మొదలవుతుంది. ఈ ఇద్దరూ పూర్తి భిన్నమైన సామాజిక,ఆర్థిక వర్గాలకు చెందిన వారు. జయరాం కోటీశ్వరుడయితే, మురళీశర్మ కార్ డ్రైవర్. కానీ ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. జయరాం, టబూల సంతానం అల్లు అర్జున్, అలాగే మురళీ శర్మ కొడుకు సుశాంత్. ఈ ఇద్దరూ ఒకేసారి పుడతారు. ఆ సమయంలో స్నేహితుల మధ్య పిల్లల పెంపకం గురించి ఒక డిస్కషన్ వస్తుంది.
ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాక డ్రైవర్ కొడుకు డ్రైవర్‌గా, అలాగే కోటీశ్చరుడి కొడుకు కోటీశ్వరుడిగానే అవుతారు అని మురళీశర్మ వాదిస్తాడు. కానీ జయరాం, ఆ పిల్లల పెంపకాన్ని బట్టి వారి ఫేట్ డిసైడవుతుందని అంటాడు. వారిలో కష్టపడే మనస్తత్వం, ఆలోచించే విధానం, జీవితంలో పైకి రావాలన్న తపనలే వారిని ముందుకు నడిపిస్తాయని అతని వాదన. వాదోపవాదాలు పెరిగి ఆ ఇద్దరూ పిల్లలను మార్చుకునే దాకా వస్తుంది. ఈ విషయం మరెవరికీ తెలియకూడదనే షరతులతో అగ్రిమెంట్ కూడా చేసుకుంటారు.
అలా కోటీశ్వరుడిగా సుశాంత్, డ్రైవర్ కొడుకుగా అల్లు అర్జున్ పెరుగుతారట. పెద్దైన తర్వాత అసలు విషయం తెలిసిపోయిన తర్వాత కూడా సుశాంత్ తను డ్రైవర్ కొడుకుగా వెళ్ళిపోవడానికి ఒప్పుకోడు. ఇదే ట్విస్ట్. ఈ పాత్రల మధ్యలోకి విలన్ నవదీప్ కూడా ప్రవేశిస్తాడు. ఇలా సాగే ఈ కథ మొత్తం “వైకుంఠపురం” అని పేరున్న జయరాం ఇంటిలో జరుగుతుందట. ఈ కథ వింటుంటే ఎక్కడి నుండి ప్రేరణ వచ్చిందా అని ఆలోచిస్తే ఒకటీ, రెండు సినిమా పేర్లు మస్తిష్కంలో మెదులుతున్నాయి. ఆ పేర్లేవో మీరే ఆలోచించండి.
ఇంతకీ ఇదేనా అసలైన కథ అంటే “అల వైకుంఠపురం” సాక్షిగా మాకయితే కచ్చితంగా తెలీదు. ఐనా, ఇంకెన్ని రోజులండీ.. 2020 సంక్రాంతి కల్లా మీ ఇంటి పక్క థియేటర్లకి వచ్చేస్తుందిగా.. అప్పుడూ తెలిసిపోతుంది.