గద్వాల్ జిల్లా అలంపూర్ టీఆర్ఎస్ నేతలు మంత్రి కేటీఆర్ కు షాక్ ఇచ్చారు. మంగళవారం అలంపూర్ పర్యటనకు వస్తున్న కేటీఆర్ కార్యక్రమాన్ని మూకుమ్మడిగా బహిష్కరించారు. కేటీఆర్ టూర్ కు అలంపూర్ మండలం నుంచి ఏ ఒక్కరు కూడా హాజరుకాబోమని టీఆర్ఎస్ కార్యకర్తలంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నారు. ఈ మేరకు అలంపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ మనోరమ అధికారిక ప్రకటన చేశారు.
అలంపూర్ పట్టణానికి వంద పడకల ఆసుపత్రి కేటాయిస్తూ ఇటీవల జీవో 98 విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఉన్నట్టుండి అలంపూర్లో కాకుండా ఆసుపత్రి నిర్మించే స్థలాన్ని.. 15 కిలోమీటర్ల దూరంలోని ఉండవల్లి మండలం పరిధిలోకి వచ్చే ప్రాంతానికి మార్చారు అధికారులు. అక్కడ మంగళవారం నాడు శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. దీంతో పేరుకు అలంపూర్ కు ఆస్పత్రిని ఇస్తున్నామని చెప్పి.. అసలు పట్టణ ప్రజలకు అందుబాటులో లేకుండా మరోచోట నిర్మించడం ఏమిటని స్థానిక టీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు.
ఇప్పటికే అలంపూరు పట్టణానికి రావాల్సిన గురుకుల పాఠశాల, డిగ్రీ కళాశాలను ఇతర ప్రాంతానికి తరలించారని, ఇప్పుడు వంద పడకల ఆసుపత్రి విషయంలో కూడా మోసం చేస్తున్నారంటూ టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం అలంపూర్లో ఆస్పత్రిని నిర్మించకపోతే జోగులాంబ అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ కార్యక్రమాన్నే టిఆర్ఎస్ నేతలు బహిష్కరించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది