మారిన వాతావరణం కారణంగా తెలంగాణలో ఉరుములు,మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఏపీలో కూల్ క్లైమాట్ ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముఖ్యంగా నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాయలసీమతో పాటు, తమిళనాడును వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. దక్షిణ తమిళనాడులోని 5 జిల్లాలతో పాటు రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయి.
ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు ద్రోణి కొనసాగుతోంది. బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాల నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. శని, ఆదివారాలు కూడా వరుణుడు విజృంభించనున్నాడు.దీంతో ఏపీలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఏపీ సర్కార్ సూచించింది.
సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.