ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత అలెస్ బియాలియాత్ స్కీ కి జైలు శిక్ష పడింది. బెలారస్ లోని ఓ కోర్టు ఆయనకు 10 ఏండ్ల జైలు శిక్ష విధించింది. ఆయనతో పాటు మరో ముగ్గురికి కూడా జైలు శిక్షి విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
పౌర భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నారనీ, స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారంటూ వారిపై ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఆయన స్థాపించిన వియస్నా మానవహక్కుల సంస్థ బెలారస్ పౌరుల హక్కుల కోసం పోరాటాలు చేస్తోంది.
దీనిపై బహిష్కృత బెలారసియన్ ప్రతిపక్ష నాయకుడు స్వియాట్లానా సిఖానౌస్కాయ స్పందించారు. అదే విచారణలో శిక్ష విధించబడిన బియాలియాత్ స్కీ, ఇతర కార్యకర్తలు అన్యాయంగా దోషులుగా నిర్ధారించబడ్డారని అన్నారు. ఈ తీర్పు చాలా భయంకరమైనదని పేర్కొన్నారు.
2020లో దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో వివాదాస్పద రీతిలో తిరిగి ఎన్నికయ్యారు. ఆ సమయంలో ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో చాలా మంది నిరసనకారులను ప్రభుత్వం అరెస్టు చేసింది. అయితే అరెస్టైన వారిలో చాలా మందికి అలెస్ న్యాయ, ఆర్థిక సహాయం చేశారు. ఆ తర్వాత ఆయన్ని అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైళ్లో ఉన్నారు. జైల్లో ఉండగానే గతేడాది ఆయనకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.