ప్రముఖ సినీ నటుడు అలీ రాజ్యసభకు నామినేట్ కాబోతున్నాడనే ప్రచారం జోరుగా నడుస్తోంది. అయితే ఏపీలో నలుగురు రాజ్యసభ సభ్యులను తొందరలోనే నియమించనున్నట్టు తెలుస్తోంది. అందులో ఓ స్థానంలో అలీకి చాన్స్ దక్కుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే.. సినిమా టికెట్ల వివాదంపై గురువారం సినీ ప్రముఖులు ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. సినిమా టికెట్ల రేట్లకు సంబంధించిన విషయమై చర్చించారు. ఆ చర్చల్లో సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.
ఈ చర్చల్లో భాగంగా చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, పోసాని, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తితో పాటు అలీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. చర్చల అనంతరం వారం రోజుల తర్వాత తనను కలవాలని అలీకి జగన్ సూచించారు. దీంతో అలీని రాజ్యసభకు పంపిస్తారన్న ఊహాగానాలు రాజకీయ నేతల్లో మొదలయ్యాయి.
మరో మూడు నెలల తర్వాత ఏపీ నుంచి నలుగురు రాజ్యసభకు ఎంపిక కానున్నారు. ఇందులో ఒక సీటును మైనారిటీలకు కేటాయించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సీటును అలీకి కేటాయించాలని జగన్ చూచాయగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజానికి గత ఎన్నికల సందర్భంగా అలీ రాజమండ్రి టికెట్ ను ఆశించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఆ తర్వాత ఎమ్మెల్సీ స్థానాల భర్తీ సందర్భంగానూ అలీ పేరు తెరపైకి వచ్చినప్పటికీ.. అప్పుడు కూడా నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలో జగన్ తనను కలవాలని అలీని కోరడం రాజ్యసభకు పంపేందుకేనన్న ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై అలీ మాట్లాడుతూ.. సీఎం తనను వారం రోజుల తర్వాత కలవమన్నారని అన్నారు. కానీ.. ఆయన తనకు ఏం ఇస్తారనేది మాత్రం తనకు తెలియదని అన్నారు.