ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బే అనడంలో ఏ సందేహమూ లేదు. అలాంటి ఉదహరణలు లేకపోనూ లేదు. అందుకే ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో నీతి, న్యాయం, ధర్మం అన్నీ డబ్బుకి అమ్ముడు పోతున్నాయి.
భార్యా భర్తలు, తల్లీపిల్ల..తండ్రీకొడకులు, అన్నాతమ్ముడు.. అక్కాచెల్లెళ్ళు ఒకటేమిటి మానవ సంబంధాలన్నీ డబ్బుమాయలో పడివెలవెలబోతున్నాయి. బతికి ఉండగానే తనవారిని తరిమికొడుతున్నారు..కొందరు ఆస్తులు సంపాదించి పెట్టలేదని అమ్మానాన్నలను ఆడిపోసుకుంటూ ఉంటే మరికొందరు పంచిన ఆస్తిలో వాటాలు తక్కువయ్యాయని బైటకు గెంటేస్తున్నారు.
కలిమి సృష్టిస్తున్న ఈ ఘోర కలిని చూసి విసిగిపోయిన ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. మానవ సంబంధాల మీద నమ్మకం కోల్పోయిన ఆ వక్తి..తన వర్ధంతిని తానే జరిపించుకున్నాడు. శ్రార్ధకర్మలు ఎంత శ్రద్ధగా జరిపించాలో తెలియ చెప్పాలనుకున్నాడు.
డబ్బే ప్రధానమైన లోకానికి చెంపపెట్టులాంటి ఈ సంఘటన ఫతేగఢ్ సాహిబ్ జిల్లా మజ్రి సోధియా గ్రామంలో జరిగింది. వైరాగ్యానికి పరాకాష్టను ఊహించిన భజన్ సింగ్ అనే వృద్ధుడు గత ఐదేళ్ళ నుంచి తన వర్ధంతిని తానే నిర్వహించుకుంటున్నాడు.
సాధారణంగా మనిషి మరణించిన అనంతరం.. అతని కుటుంబ సభ్యులు వారికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరణించిన వారిని గుర్తు చేసుకుంటూ ఆ కుటుంబ సభ్యులు ప్రతి ఏటా వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే కారణమేదైనా కొందరు మాత్రం పంతాలు పట్టింపులతో తమ తల్లిదండ్రుల వర్ధంతిని నిర్వహించరు.
పంజాబ్‌కు చెందిన భజన్ సింగ్ నిశితంగా ఆలోచించాడు, నిర్మొహమాటంగా తన ఏటిమాసికాన్ని తానే నిర్వహించుకుంటున్నాడు. ఇలా గత ఐదేళ్లుగా వర్ధంతి కార్యక్రమాన్ని తనకు తానే నిర్వహించుకుంటూ ఉన్నాడు. ఇందుకు అతని కుటుంబ సభ్యులు సైతం సహకరించడం విశేషం.
వృత్తిరీత్యా ఓ మిల్లులో పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే శాస్త్రబద్ధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని అందరికీ తెలియచేయడమే తన ఉద్దేశమని భజన్ సింగ్ తెలిపారు. తన వర్ధంతి కార్యక్రమంలో భాగంగా పేదలకు దుప్పట్లు పంచాడు. అనాధలకు భోజనం పెట్టించాడు. ఇలా తాను ఐదేళ్లుగా వర్ధంతి జరుపుకుంటున్నట్టు తెలిపాడు.