ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్) సంస్థ తాజా నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. కర్ణాటకలోని కొత్త ప్రభుత్వంలో సీఎం సహా కేబినెట్ మంత్రులందరికీ నేర చరిత ఉందని వెల్లడించింది. వారిలో నలుగురిపై సీరియస్ క్రిమినల్ కేసులు వున్నాయని వెల్లడించింది.
అందులో సీఎం సిద్ధరామయ్యపై 13 కేసులు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పై 19, మంత్రులు లక్ష్మణ్‌రావుపై2, ఎంబీ పాటిల్ పై 5, రామలింగారెడ్డిపై 4, బీజే జమీర్ అహ్మద్‌ఖాన్ పై 5 కేసులు, కేహెచ్ మునియప్పపై 1, డాక్టర్ జీ పరమేశ్వర పై 3, ప్రియంక్ ఖర్గేపై 9 కేసులు వున్నట్టు చెప్పింది.
కేబినెట్ మంత్రులందరూ కోటీశ్వరులేనని పేర్కొంది. 9 మంది మంత్రుల సగటు ఆస్తులు రూ.229.27 కోట్ల పైనే వున్నట్టు తెలిపింది. ఇందులో అత్యధికంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రూ.1413.80 కోట్ల ఆస్తులు, అతి తక్కువగా ప్రియాంక్ ఖర్గే రూ. 16.83 కోట్ల ఆస్తులను కలిగి వున్నారని వివరించింది.
మంత్రుల్లో ముగ్గురు 8వ, 12వ తరగతి విద్యార్హత, ఆరుగురు మంత్రులు గ్రాడ్యుయేషన్, ఆ పైన విద్యార్హత కలిగివున్నట్టు తెలిపింది. నివేదక ప్రకారం… మంత్రుల్లో ఐదుగురి వయస్సు 41 నుంచి 60 వరకు, నలుగురి వయస్సు 61 నుంచి 80 వరకు వుంటుంది.