హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన కోలాహలం కొనసాగుతుంది. బొజ్జ గణపయ్యలు ఒక్కొక్కటిగా ట్యాంక్ బండ్ చేరుతున్నాయి. ఇక తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న శ్రీ పంచముఖ మహాలక్ష్మీ గణపతి కాసేపట్లో గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెంబర్ 4 దగ్గర ఈ మహాగణపతి నిమజ్జనం కానుంది.
#GaneshImmersion2022#KhairatabadGaneshImmersion2022 Procession is about to start. pic.twitter.com/CSl2FdAEYe
— Telangana State Police (@TelanganaCOPs) September 9, 2022
సుమారు 70 టన్నుల బరువున్న ఖైరతాబాద్ గణేషుడిని మోసేందుకు సరికత్త టెక్నాలజీ ఉన్న ట్రాలీని ఉపయోగించారు. కాసేపటి క్రితమే వినాయకున్ని ట్రాలీలో ఎక్కించారు. ట్రాలీలో వెల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లో శోభయాత్ర ప్రారంభం కానుంది. 67 సంవత్సరాల ఉత్సవ కమిటీ చరిత్రలోనే తొలిసారి 50 అడుగులు మట్టి విగ్రహాన్ని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ తయారు చేసింది.
ప్లాస్టర్ ఆప్ పారిస్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని గతేడాది హైకోర్ట్ ఆదేశించింది. దీంతో అందరూ మట్టి విగ్రహాలే పెట్టాలనే సందేశాన్ని ఇస్తూ.. ఈ సారి ప్లాస్టర్ ఆప్ పారిస్ విగ్రహానికి స్వస్తి పలికింది ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ.
చార్మినార్, మెజాంజాహి మార్కెట్ నుంచి భారీ సంఖ్యలో గణనాథులు హుస్సేన్ సాగర్ చేరుకుంటున్నాయి. శోభాయాత్రలో యువత, పిల్లలు డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. బ్యాండు, డీజీలతో హుస్సేన్‌సాగర్ పరిసరాలు దద్దరిల్లుతున్నాయి. నిమజ్జన శోభాయాత్రలో కోలాటం, భజనలతో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నగరం నలుమూలల నుంచి వస్తున్న గణనాథులతో ట్యాంకుబండ్ ఆధ్మాత్మిక పరిమళాలు వెదజల్లుతోంది. ఎన్టీఆర్ మార్గ్ భక్తులతో కిక్కిరిసిపోయింది.