మీరెప్పుడైనా సముద్రం అడుగు భాగంలోకి వెళ్లారా? ఎంతో అందంగా రంగురంగులతో కోరల్ రీఫ్స్(పగడపు దిబ్బలు) ఉంటాయి. వాటిని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. అయితే వాతావరణంలో మార్పులు, సముద్రపు నీరు వేడెక్కడం, అధికంగా చేపల వేట కారణంగా పశ్చిమ హిందూ మహాసముద్రంలోని పగడపు దిబ్బలు ప్రమాదంలో పడినట్లు తేలింది. వచ్చే 50 ఏళ్లలో అవి కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.
పశ్చిమ హిందూ మహాసముద్రంలోని 10 దేశాలలోని పగడపు దిబ్బలను 11 ఉప ప్రాంతాలుగా విభజించి పరిశోధన జరిపారు సైంటిస్టులు. అక్కడ పర్యావరణ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం కారణంగా రానున్న రోజుల్లో అవి కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందని గుర్తించారు. ఆయా ద్వీప దేశాలలోని పగడపు దిబ్బలు అధిక ముప్పులో ఉన్నాయని చెబుతున్నారు.
తూర్పు, దక్షిణ మడగాస్కర్, కొమొరోస్, మస్కరీన్ దీవులలోని నాలుగు ఉపప్రాంతాల్లో ఇప్పటికే కోరల్ రీఫ్స్ అంతరించిపోయే దశలో ఉన్నాయని తెలిపారు సైంటిస్టులు. సముద్రపు నీటి ఉష్ణోగ్రతల్లో మార్పులే ఆయా ద్వీప దేశాల్లో పగడపు దిబ్బలకు ముప్పుగా తయారయ్యానని అంటున్నారు. అలాగే ఎక్కువగా చేపలు పట్టడం కూడా మరో కారణంగా వివరిస్తున్నారు.