వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌ను భారత్‌లో నిర్వహించనున్న విషయం విదితమే. అయితే ఆ టోర్నీకి గాను ఐసీసీకి పన్ను మినహాయింపులు కల్పించేలా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలంటూ ఐసీసీ ఇప్పటికే బీసీసీఐని కోరింది. అందుకు గాను పలు మార్లు గడువు పొడిగించారు. ఇక ఇందుకు గాను డిసెంబర్ 31వ తేదీని ఆఖరి గడువుగా ఐసీసీ నిర్ణయించింది. ఈ క్రమంలో బీసీసీఐ ఇదే విషయంతోపాటు పలు కీలక అంశాలపై గురువారం జరగనున్న వార్షిక సాధారణ బాడీ మీటింగ్‌లో చర్చించనుంది.
వచ్చే ఏడాది భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు గాను పన్ను మినహాయింపులు వచ్చేలా చూడాలని ఐసీసీ ఆశిస్తోంది. ఈ క్రమంలోనే బీసీసీఐ తన బోర్డు మెంబర్లకు ఈ విషయాన్ని లేఖల ద్వారా వివరించింది. దీంతో మీటింగ్ ఈ అంశంపై ప్రధానంగా చర్చిస్తారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఇతర బోర్డు మెంబర్లు ఈ చర్చల్లో పాల్గొంటారు. అయితే గడువు తేదీలోగా ఈ విషయంపై స్పష్టత ఇవ్వకుంటే అప్పుడు ఐసీసీ రెండు మార్గాలను ఆలోచిస్తోంది. ఒకటి.. టీ20 వరల్డ్ కప్‌ను యూఏఈలో నిర్వహించడం. లేదా పన్ను మొత్తాన్ని బీసీసీఐకి వచ్చే ఆదాయం నుంచి కట్ చేయడం. అయితే దీనిపై బీసీసీఐ గురువారం చర్చలు జరపనున్నందున ఈ విషయంపై ఆ మీటింగ్‌లో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఇదే కాకుండా 2028లో లాస్ ఏంజల్స్‌లో జరగనున్న ఒలంపిక్ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చేందుకు ఐసీసీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో బీసీసీఐ బోర్డు పెద్దలు ఈ విషయంపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రెండు కొత్త ఐపీఎల్ టీంలను ప్రవేశపెట్టే విషయమై కూడా బీసీసీఐ బోర్డు సభ్యులు చర్చించనున్నారు. ఒక కొత్త టీంను 2021లో, ఇంకో కొత్త టీంను 2022లో ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాదిలోనే 2 కొత్త టీంలను ప్రవేశపెడితే బాగుంటుందని పలువురు బీసీసీఐ పెద్దలు చర్చిస్తున్నట్లు తెలిసింది.
కొత్త టీంలను చేర్చడం వల్ల ఫ్రాంచైజీల మధ్య పోటీ మరింత పెరుగుతుందని, అలాగే మరింత మంది ప్లేయర్లకు ఐపీఎల్ ఆడే అవకాశం లభిస్తుందని బీసీసీఐ బోర్డు సభ్యులు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే గత కొద్ది రోజులుగా ఐపీఎల్‌లో మరో రెండు కొత్త టీంలను అందుబాటులోకి తెస్తారని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయంపై కూడా బీసీసీఐ మీటింగ్‌లో చర్చించనున్నారు. అయితే కొత్త టీంలలో ఒకటి అహ్మదాబాద్ ఉంటుందని తెలుస్తుండగా, ఇంకొకటి ఏ టీం అనేది సస్పెన్స్‌గా మారింది. ఈ క్రమంలోనే అన్ని విషయాలపై గురువారం జరిగే సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.