లడఖ్ లో పరిస్థితి ఏ మాత్రం బాగులేదని, ప్రభుత్వం మేల్కోవాలని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ హెచ్చరిస్తున్నారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని హిమనదుల్లో (గ్లేసియర్స్) లో చాలాభాగం క్రమేపీ హరించుకుపోతున్నాయని ఆయన ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తెచ్చారు. బాలీవుడ్ లో లోగడ ‘త్రీ ఇడియట్స్’ మూవీ ని ఈయన జీవిత చరిత్రనే ఆధారంగా చేసుకుని తీశారు. ఆదివారం ఓ వార్తాసంస్థతో మాట్లాడిన ఆయన.. పరిశ్రమల నుంచి లడఖ్ ను కాపాడుకోలేకపోతే ఈ హిమ నదులు పూర్తిగా కనుమరుగైపోయి ఇండియాలోనూ, పొరుగు ప్రాంతాల్లోనూ తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కేంద్రపాలిత ప్రాంతంలో మంచి స్థితిలో ఉన్న టూరిజం, వాణిజ్య మార్కెట్లు క్రమంగా దెబ్బ తింటాయని కశ్మీర్ యూనివర్సిటీకి, మరి కొన్ని రీసర్చ్ సంస్థలకు చెందిన పరిశోధకులు ఇదివరకే ఈ విషయాన్ని కనుగొన్నారు. లడఖ్ లోని హిమ నదుల్లో మూడింట రెండువంతులు హరించుకుపోతున్నాయని వారు తమ అధ్యయనంలో తెలిపారు అని వాంగ్ చుక్ అన్నారు.
ఇక్కడ మానవ కార్యకలాపాలకు ముప్పు తలెత్తే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ క్లైమేట్ చేంజ్ కి అమెరికా, యూరప్ దేశాలే కారణం కాదని, స్థానిక కాలుష్యాలు, విష వాయువులు కూడా కారణమవుతున్నాయని ఆయన చెప్పారు. లడఖ్ వంటి ప్రాంతాల్లో గ్లేసియర్స్ ని పరిరక్షించుకోలేని పక్షంలో ఇక్కడివారికే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలకు కూడా ప్రమాదకరమన్నారు.
పరిశ్రమల నుంచి లడఖ్ తో బాటు పరిసర హిమానీ ప్రాంతాలను కూడా రక్షించాలని ఒకప్పటి ఇంజనీర్ అయిన వాంగ్ .. ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇక పిల్లలు కూడా ఆహారాన్ని వృధా చేయడం మానుకోవాలని, పరిరక్షణ అన్నది వారి బాధ్యతగా కూడా ఉందని ఆయన చెప్పారు.