ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 9 సినిమాలు ఈ వారం రిలీజ్ అయ్యాయి. వీటిలో ఒకటి కాకపోయినా ఒకటైనా క్లిక్ అవుతుందనుకున్నారు. కనీసం 3 రోజులైనా నడుస్తుందనుకున్నారు. మరీ ముఖ్యంగా సమ్మతమే సినిమా అయినా నిలబడుతుందని ఆశించారు. కానీ.. శుక్రవారం రిలీజైన సినిమాలన్నీ ఫ్లాపులయ్యాయి. వసూళ్ల మాట దేవుడెరుగు, కనీసం మంచి టాక్ కూడా రాలేదు.
కిరణ్ అబ్బవరం నటించిన సమ్మతమే సినిమాపై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు ఓ రేంజ్ లో ప్రచారం చేశారు. స్వయంగా గీతాఆర్ట్స్ సంస్థ కొన్ని ప్రాంతాల్లో రిలీజ్ చేసింది. మరోవైపు స్వయంగా హీరో, మొదటి రోజు మొదటి ఆటకు ఫ్రీ టికెట్లు ఇచ్చాడు. అయినప్పటికీ ఈ చిత్రానికి వసూళ్లు లేవు.
మొదటి రోజు సమ్మతమే సినిమాకు 50లక్షల రూపాయలకు పైగా షేర్ వచ్చింది. శనివారం ఆక్యుపెన్సీ మరింత పడిపోయింది. దీనికితోడు టాక్ దారుణంగా ఉంది. ఫస్టాఫ్ ఒకరు, సెకెండాఫ్ ఒకరు తీశారనే విమర్శలొచ్చాయి. మరీ ముఖ్యంగా షార్ట్ ఫిలిం కంటెంట్ తో ఫీచర్ ఫిలిం తీశారనేది అందరి మాట. ఇలాంటి టాక్ తో ఈకాలంలో ఓ సినిమా థియేటర్లలో కొనసాగడం చాలా కష్టం.
అటు ఆకాష్ పూరి హీరోగా నటించిన చోర్ బజార్ సినిమా పరిస్థితి మరింత దారుణం. ఆకాష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమా ఇది. అటుఇటుగా 6 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీశారు. కట్ చేస్తే, మొదటి రోజు 40 లక్షలొచ్చాయి. బ్రేక్ ఈవెన్ గురించి ఆలోచించడం కూడా అనవసరం. అలాంటి టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా. సినిమా చూసిన ప్రతి ఒక్కరు తమచేత నరకం స్పెల్లింగ్ రాయించారంటూ మండిపడ్డారు.
రిలీజైన 9 సినిమాల్లో కూసింత అంచనాలతో వచ్చిన ఈ 2 సినిమాల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక మిగతా సినిమాల గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అయితే.. ఒక మూవీ గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదే ఆర్జీవీ తీసిన కొండా సినిమా. ఈ చిత్రం చూసిన జనాలు వర్మను బండ బూతులు తిడుతున్నారు.