వచ్చే నెల 14 నుండి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నందున ఎంపీలు కరోనా బారిన పడకుండా సభను నిర్వహించే అంశాలపై స్పీకర్ దృష్టిసారించారు. వరుసగా రెండో రోజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉభయ సభలకు చెందిన అధికారులు, ఆరోగ్య శాఖ, డీఆర్డీఓతో పాటు ఇతర విభాగాల అధికారులతో సమావేశమయ్యారు.
ఆరోగ్యశాఖ నిబంధనలకు అనుగుణంగా లోక్సభ, రాజ్యసభలో సీట్లలో అధికారులు ఏర్పాటు చేశారు. భౌతిక దూరం పాటించటం, పరిసరాలను శానిటైజ్ చేయటం, సీట్ల కేటాయింపు వంటి అంశాలపై చర్చించారు. సమావేశాలకు 72 గంటల ముందు ఎంపీలంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, కరోనా పరీక్ష కేంద్రాలను పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
కరోనా కారణంగా సభ్యుల మధ్య భౌతిక దూరం పాటించేందుకు గాను సీట్ల మధ్య దూరం పెంచాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటి వరకు ఉన్న గ్యాలరీల్లో కూడా ఎంపీలకు సీట్లను ఏర్పాటు చేయనున్నారు. కొందరు సభ్యులకు రాజ్యసభలో సీట్లను కేటాయిస్తారు. రాజ్యసభ సభ్యులకు కూడా ఇవే నిబంధనలను అమలు చేయనున్నారు. అందుకోసం లోక్సభ, రాజ్యసభ సమావేశాలను విడతల వారీగా జరపాలని నిర్ణయించారు.