కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి రాజకీయ పార్టీలు. మున్సిపల్ ఎన్నికలపై ఎక్కువగా పట్టణ ప్రాంత ఓటర్ల ప్రభావం ఉంటుంది. సంక్షేమ పథకాల ప్రభావం కాస్త తక్కువనే చెప్పుకోవాలి. తెలంగాణ లోని మూడు ప్రధాన పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికలపై మంచి ఫలితాలు సాధించాలి అని ఎత్తులు వేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో మోడీ హవా ఉంటుంది కాబట్టి బీజేపీ కూడా చెప్పుకొదగ్గ మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని చూస్తుంది. ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధం అవుతుంటే ప్రభుత్వం మాత్రం కాస్త వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆ ప్రభావం ఖచ్చితంగా మున్సిపోల్స్ పై ఉంటుంది. హుజూర్ నగర్ ఎన్నికల్లో గ్రామీణ ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి సంక్షేమ పథకాలు టిఆర్ఎస్ కు కలిసొచ్చాయి. మున్సిపోల్స్ లో మాత్రం ఓటరు నాడి వేరేగా ఉంటుంది. చదువుకున్న ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని చాలా వరకు వ్యతిరేకిస్తున్నారు. సెలవులు పొడిగించడంపై పట్టణ ప్రజలో తీవ్ర వ్యతిరేకత ఉంది, అది ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలై 18 రోజులు గడుస్తుంది, రోజు రోజుకు సమ్మెను ఉధృతం చేస్తున్నారు. సమ్మె ఎఫెక్ట్ తో పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు, సమ్మె పై సీఎం, మంత్రుల ప్రకటనలను వ్యతిరేకిస్తున్నారు. పైగా సమ్మెలో ఉన్న 50వేల మంది ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు, వారి బంధువులంతా పట్టణ ప్రాంతాల్లో స్థిరపడ్డవారే. ఈ సమయం లో మున్సిపోల్స్‌కు వెళ్తే ఇబ్బందులు తప్పవని టిఆర్ఎస్ నేతలు ఆలోచిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఎన్నికలకు వెళ్ళక తప్పని పరిస్థితి, ఆలాగని ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. కోర్టు తీర్పు ను గౌరవిస్తూనే ఎన్నికలను ఇంకొన్ని రోజులు వాయిదా ఎలా వేయాలి అని గులాబీ బాస్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
అందులో భాగంగానే కోర్టు తీర్పులో ఓ అంశాన్ని వాడుకోబోతున్నారు. ఇప్పటికే చాలా మున్సిపాలిటీ ఎన్నికలపై సింగిల్ బెంచ్ స్టే ఉంది. సో అక్కడ స్టే ఎత్తివేస్తేనే ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటోంది అధికార టీఆరెఎస్ పార్టీ.