రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు గండం వచ్చి పడింది. అదే హుజుర్ నగర్. పైకి అన్ని పార్టీలు తమదే విజయం అంటూ ధీమాను ప్రధర్శిస్తున్నా… ఈ ఉప ఎన్నిక ఫలితాలు పార్టీల భవిష్యత్ కు మార్గ నిర్దేశం చేయబోతుంది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా… ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కాగానే, అధికార పార్టీ క్యాండిడేట్ ను ప్రకటించింది.
అధికార పార్టీ హోదాలో హుజుర్ నగర్ గెలుపు టీఆర్ఎస్ పార్టీకి అతి కీలకం. పైగా అది ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు రాజీనామా చేసిన స్థానం. అక్కడ గెలుపుతో… మొత్తం కాంగ్రెస్ శ్రేణుల ఆత్మస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. మేము బలపడుతున్నాం అని చెప్పుకుంటున్న బీజేపీకి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లవుతుంది. అందుకే కేసీఆర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా…. ప్రచారంలో ముందుండేందుకు అబ్యర్థిని ప్రకటించేశారు. జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డికి బాద్యత అప్పగించారు. ఇక హుజుర్ నగర్ నియోజవకర్గంలోని ప్రతి మండలానికి ఓ మంత్రిని ఇంచార్జీగా, ప్రతి రెండు-మూడు గ్రామాలకు ఓ ఎమ్మెల్యేకు బాద్యతలు అప్పగించబోతున్నారు.
ఇటు కాంగ్రెస్ కు కూడా చావో-రేవో అన్నట్లు తయారైంది. ఉత్తమ్ సిట్టింగ్ సీట్ కావటంతో…. కాంగ్రెస్ తన అబ్యర్థిని తప్పక గెలుపించుకోవాల్సి ఉంది. బరిగీసి టీఆరెస్ తో మరో నాలుగేండ్లు పోరాటం చేయడానికి ఈ ఉప ఎన్నిక గెలుపే టానిక్ లా పనిచేస్తుంది. అయితే, ఇంకా అబ్యర్థిని ప్రకటించకపోవటం…. కాంగ్రెస్ లో ఉన్న గ్రూపులు ఆ పార్టీకి మైనస్ గా మారుతుండగా, ఎట్టకేలకు పాత నల్గొండ జిల్లా నాయకులు జానారెడ్డి-కోమటిరెడ్డి బ్రదర్స్-ఉత్తమ్ లు సయోధ్యకు రావటం కాస్త సానుకూల అంశంగా కనపడుతోంది.
ఇక, టీర్ఎస్ కు ప్రత్యామ్నయం మేమే అని కొంతకాలంగా జోష్ లో ఉన్న బీజేపీకి హుజుర్ నగర్ ఉప ఎన్నిక కీలకమే. ఇక్కడ గతంలో బీజేపీకి చెప్పుకోదగ్గ స్థానం లేదు. డిపాజిట్ వస్తే గొప్ప అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు ఆ సాకు పనిచేసేలా కనపడటం లేదు. అబ్యర్థి ఎవరైనా… టీఆర్ఎస్-కాంగ్రెస్ లకు దీటుగా ఓట్లు సంపాదించుకోవాల్సిందే. లేదంటే… ఇన్నాళ్లు చూపించిన ఉత్సాహం, నాలుగు ఎంపీ స్థానాలు గెలిచిన ఊపు అంతా పోతుంది.
నాలుగో పార్టీ టీడీపీ. టీడీపీకి గతంలో హుజుర్ నగర్ లో గట్టి పట్టుండేది. క్యాడర్ కూడా ఎక్కువే. అయితే… మారిన పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ ఎంతవరకు పోటీ ఇస్తుంది..?, లేదా గత అసెంబ్లీ ఎన్నికల దోస్తానాను కంటిన్యూ చేస్తూ… కాంగ్రెస్ కు అండగా నిలబడుతుందా అన్నది చూడాలి. అయితే, పోటీలో ఉంటే మాత్రం…. చెప్పుకోదగ్గ ఓట్లు వస్తేనే, కాస్తో కూస్తో ఉన్న నాయకులు, శ్రేణులు పార్టీ కోసం నిలిచే అవకాశం ఉంటుంది.
ఇక పై నాలుగు ప్రధాన పార్టీలకు దీటుగా… గెలుపోటములను డిసైడ్ చేసే గుర్తు మరొకటి ఉంది. అదే ట్రక్కు గుర్తు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల ట్రక్కు గుర్తు అబ్యర్థుల తలరాతలను మార్చేసింది. అందుకే ట్రక్కు వల్లే మేం హుజుర్ నగర్ లో ఓడిపోయాం అంటూ మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. పైగా టీఆర్ఎస్ నేతలు డిల్లీ వెళ్లి మరీ… ట్రక్కు గుర్తు కారుకు దగ్గరగా ఉన్నందున, ఆ గుర్తు ఎవరికీ కేటాయించవద్దంటూ…. కేంద్ర ఎన్నికల సంఘానికి అర్జీ కూడా పెట్టుకున్నారు. సో…. ట్రక్కు కూడా ప్రధాన పోటీదారే అన్నట్లు.
Advertisements
సో… హుజుర్ నగర్ ప్రజానికం ఎవరివైపు నిలబడతారో, ఎవరికి పట్టంకడతారో… దానిపైనే ఇతర పార్టీల భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.