-ఓటర్లకు స్లిప్పుల పంపిణీ
-పోలింగ్ కేంద్రాలకు నిర్వహణ సామాగ్రి
-పటిష్టమైన బందోబస్తు
తెలుగు రాష్ట్రాల్లో రేపు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్దమైంది. హైదరాబాద్ ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రేపు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మూడు జిల్లాల్లోని 137 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుందన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 29,720.
ఇక ఎన్నిక నిర్వహణకు అవసరమైన సామాగ్రిని గ్రేటర్ హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పంపిణీ కేంద్రం నుంచి ఎన్నికల అధికారులు తీసుకెళ్లాలని అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోని 22 పోలింగ్ కేంద్రాల ఎన్నికల నిర్వహణకు 12 మంది సెక్టోరల్ అధికారులను నియమించామని డీఈవో వెల్లడించారు.
మరో వైపు ఏపీలో 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం జరగనున్న 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజక వర్గానికి సంబంధించి మొత్తం ఆరు జిల్లాల్లో 331 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. రెండు లక్షల 9 వేల మంది ఓటర్లు తమ ఓటును నమోదు చేసుకోగా.. ఇప్పటికే ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అనకాపల్లి జిల్లాలో 49,అల్లూరి జిల్లాలో 15,విజయనగరం జిల్లాలో 72, మన్యం జిల్లాలో 24, శ్రీకాకుళం జిల్లాలో 59 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.