నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈనెల 22న కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు సంబంధించిన ఫ్లెక్సీలు, పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు చించివేయడంపై కలకలం చెలరేగింది. పట్టణంలోని మెడికల్ కాలేజీ నుంచి నూతన కలెక్టరేట్ వరకు వీటిని గురువారం ఏర్పాటుచేశారు. వాటిని శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నామరూపాల్లేకుండా చించివేశారు.
ఈ విషయమై మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ పి.మనోహర్ కు ఫోన్ లో ఫిర్యాదుచేశారు. దుండగులపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. ఈనెల 7న మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి బిజినేపల్లి మండలంలో మార్కెండేయ రిజర్వాయర్ పనుల సందర్శనకు వెళ్లిన సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.
తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో వాల్యానాయక్ అనే కార్యకర్తను బీఆర్ఎస్ నాయకులు గొంతుపై కాలు పెట్టి తొక్కారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికారపార్టీ అరాచకాలను నిరసిస్తూ ఈ నెల 22న దళిత గిరిజన ఆత్మగౌరవ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణవ్యాప్తంగా ఫ్లెక్సీలు, పోస్టర్లను ఏర్పాటుచేశారు.
వాటిని గుర్తుతెలియని వ్యక్తులు నామరూపాల్లేకుండా చించివేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ ను చూసి బీఆర్ఎస్ భయపడుతుందని అన్నారు. ఇప్పుడు జరిగిన సంఘటనను పిరికిపందల చర్యగా అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో వారికి బుద్దిచెప్పడం ఖాయమని ఘాటుగా హెచ్చరించారు.