భారత్ జోడో యాత్రలో అన్ని వర్గాల ప్రజల దగ్గర్నుంచి రాహుల్ కి మద్దతు లభించడం, అదానీ అంశంపై పదే పదే నిలదీస్తుండడంతో మోడీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయిందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. అందుకే మోడీ ప్రభుత్వం సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సాకు చేసుకొని రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వం రద్దు చేసిందని ఆయన మండిపడ్డారు.
కావాలనే రాహుల్ గాంధీ పై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని భట్టి ఆరోపించారు. ఇలాంటి సమయంలోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి దేశ ప్రజలు రాహుల్ గాంధీకి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇక రాహుల్ గాంధీ పై కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రను ప్రజాస్వామ్యవాదులు ముక్త కంఠంతో ఖండించి కదం తొక్కాలన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ.. కుమురంభీం అసిఫాబాద్ జిల్లాలోని బురుగూడ పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బస శిబిరం దగ్గర ఆయన సంకల్ప దీక్ష చేపట్టారు.
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ దీక్ష కొనసాగింది. అయితే దీక్షకు ముందు అంబేద్కర్, మహాత్మా గాంధీలతో పాటు దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఫోటోలకు పూల మాలలు వేసి ఆయన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు భారీగా పాల్గొన్నారు.