ద్వేషాలతో దేశాన్ని విడగొడుతున్నారని.. సంపదను కొంతమందికి పంచుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారం పై ఆయన ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా కుమ్మరి తండా రోడ్డుపై కాంగ్రెస్ నిరసన తెలిపింది.
ఈ నేపథ్యంలో ఎన్ఎస్యూఐ నాయకులతో కలిసి భట్టి విక్రమార్క, సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అయితే పేపర్ లీక్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ బోర్డు ఛైర్మన్, సభ్యులనే కాదు బోర్డును పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. సంబంధించిన మంత్రులు రాజీనామా చేయాలన్నారు. వ్యక్తులు వ్యవస్థకు సమాధానం చెప్పాలని అన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉన్నత చదువులు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు లేవన్నారు. జనం సమస్యలు బోలెడు ఉన్నాయని, ఏజెన్సీలో ఆదివాసులను బయటకు పంపించే కుట్ర దుర్మార్గమన్నారు. అడవి పై ఉన్న ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు క్షోభకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్రలో జనం ఎన్నో సమస్యలు నా దృష్టికి తీసుకొస్తున్నారని అన్నారు. ద్వేషాలతో దేశాన్ని విడగొట్టుతున్నారని, సందప కొంత మందికి పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏఐసీసీ ఆదేశాలతో రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన రేవంత్, ఇటు నేను పాదయాత్ర చేస్తున్నామన్నారు. లక్ష్యం చేరుకోకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వాలకు బుద్ధి చెప్పుదామని పిలుపునిచ్చారు. పోడు భూములకు పట్టాలు వస్తాయని ఆశ పడితే.. చివరకు అడవుల్లోకి రానియ్యడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవి సంపదకు దూరం చేయడమే కాదు వారిని బయటకు పంపిస్తున్నారని భట్టి మండిపడ్డారు. అటవీ సంపద అంతా వారిదే.. వద్దనడానికి నువ్వెవరు అంటూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. బ్రిటీష్ ప్రభుత్వం తరహాలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీల విషయంలో అలాగే చేస్తుందని ఆరోపించారు.