గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి డైరెక్షన్‌లో నడుస్తున్నారని వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. అమరావతి పర్యటన ద్వారా పవన్‌కల్యాణ్ ఏం లబ్ధి పొందారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ‘మీరెక్కడ తిరిగారో మాకు తెలియదా.? చంద్రబాబు డైరెక్షన్‌లో మీరు అమరావతిలో పర్యటిస్తున్న మాట వాస్తవం కాదా.. అంటూ మంగళగిరి ఎమ్మెల్యే జనసేనాని ప్రశ్నించారు. ఈ పర్యటనలో మంగళగిరి, తాడికొండ ప్రాంతాల్లో వున్న తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా పవన్‌కల్యాణ్ వెంట నడిచింది వాస్తవం కాదా, ఈ విషయం వీడియో క్లిప్పింగ్స్ చూసినా, టీడీపీ కార్యకర్తల్ని అడిగినా తెలిసిపోతుందని అన్నారు. అని ఆర్కే ఒక వీడియో రిలీజ్ చేశారు. ‘మీరు గతంలో ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఒక ఇంట్లో పెరుగన్నం తింటూ మీరన్న మాటలు గుర్తుచేసుకోండి. ‘చెల్లెమ్మా ! చంద్రబాబునాయుడు ల్యాండ్ అక్విజిషన్ పెట్టి మీ భూములు బలవంతంగా లాక్కుని నోటికాడ కూడు తీసేస్తానంటే తిరగబడండి. మీకిష్టమైతే పూలింగ్‌లో ఇవ్వండి, ఇవ్వకపోండి, కానీ బలవంతంగా భూసేకరణ చేస్తే నేను ఊరుకోను. ఇక్కడే కూర్చుని నిరాహారదీక్ష చేస్తాను అని మీరు అనలేదా.? తరువాత చంద్రబాబు ల్యాండ్ అక్విజిషన్ చేశారు కదా. అప్పుడు మీరొచ్చి నిరాహార దీక్ష చేయలేదే..’ అని ఆర్కే జనసేనానిని ప్రశ్నించారు.