తాజ్ మహల్ లో మూసి ఉన్న 22 తలుపులను తెరవాలని , ఈ మేరకు భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ)కి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది.
రజనీష్ సింగ్ దాఖలు చేసిన పిల్‌పై న్యాయమూర్తులు జస్టిస్ సుభాష్ విద్యార్థి, జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయలతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది. ఈ సందర్భంగా పిటిషనర్ పై ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. పిల్ వ్యవస్థను పిటిషనర్ అపహాస్యం చేస్తున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ విషయంలో న్యాయస్థానంలో కాకుండా డ్రాయింగ్‌రూమ్‌లో తమతో చర్చకు రావాలని తాము స్వాగతిస్తున్నామని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. దీంతో తాజ్ మహల్ గురించి పౌరులు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పిటిషనర్ వాదించారు.
తాను చాలా ఆర్‌టీఐలు దాఖలు చేశానని పిటిషనర్ తెలిపారు. తాజ్ మహల్ లో చాలా గదులకు తాళాలు వేసి ఉన్నాయని, భద్రతా కారణాల వల్ల ఆ గదులకు తాళం వేసినట్టు అధికారులు చెబుతున్నారని అన్నారు.
పిటిషనర్ వ్యాఖ్యలపై కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ అంశాలు న్యాయస్థానంలో చర్చనీయాంశమేనా? అని ప్రశ్నించింది.
“సమాచార హక్కు” గురించి పిటిషనర్ వాదనకు బెంచ్ బదులిస్తూ, ‘వెళ్లి పరిశోధన చేయండి. ఎంఏ, పీహెచ్ డీ చేయండి. అటువంటి అంశంపై పరిశోధన చేయడానికి ఏదైనా ఇన్ స్టిట్యూట్ మిమ్మల్ని అనుమతించకపోతే. అప్పుడు మా వద్దకు రండి’ అని వ్యాఖ్యానించింది.