– విజయనగరంలో 4 ఎకరాల కబ్జా
– ఎమ్మెల్యే పనే అంటున్న బాధిత మహిళ
తెలంగాణలో కబ్జాలకు కొదవే లేదు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా పెట్టే పనిలోనే ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రి స్థాయి నుంచి కిందిస్థాయి లీడర్ల దాకా ఇదే పనిలో ఉన్నారని తరచూ విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఎమ్మెల్యే రేగా కాంతారావు కబ్జా కహానీ ఒకటి వెలుగుచూసింది. బాధిత మహిళ తన బాధను మీడియాకు వివరించింది.
వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలం విజయనగరం గ్రామంలో మునిగల పిచ్చమ్మ అనే మహిళ ఆందోళనకు దిగింది. తన నాలుగు ఎకరాల భూమిని రేగా కాంతారావు ఆక్రమించారని ఆరోపిస్తోంది. తన అత్తమామలు సంపాదించిన ఆ భూమిని తనకు ఇప్పించాలని కోరుతోంది. ఎన్నో ఏళ్లుగా వారసత్వంగా వచ్చిన భూమిని కబ్జా చేశారని.. ఓట్లేసి గెలిపిస్తే.. ఇలా చేయడం సబబేనా అంటూ వాపోయింది.
విజయనగరంలోని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యం బాబు తన అనుచరులతో భూమిని కబ్జా చేసి అమ్ముకున్నారని చెబుతోంది పిచ్చమ్మ. తన భూమిని తనకు ఇప్పించాలని వేడుకుంటోంది. నాలుగు ఎకరాలకు సంబంధించిన రసీదులు అన్నీ తన దగ్గర ఉన్నాయని అంటోంది. తన భూమి ఇప్పిస్తారా? లేక, డబ్బులు ఇప్పిస్తారా? ఏదో ఒక న్యాయం చేయాలని వేడుకుంటోంది.
ఎమ్మెల్యేనే భూ కబ్జాలకు పాల్పడితే తాము ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది బాధిత మహిళ. తహసిల్దార్, రేగా కాంతారావు స్పందించి తన భూమి తనకు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.