– ఆదిత్య అక్రమాలకు అంతే లేదా?
– రోజురోజుకీ పెరుగుతున్న బాధితులు
– హఫీజ్ పేట్ లో అవినీతికి చెక్ పెట్టేదెవరు?
– షేక్ పేట్ లో మరో 600 మంది కస్టమర్స్
– గడువు ముగిసినా స్పందించని సీసీపీ దేవేందర్ రెడ్డి?
– థర్డ్ పార్టీతో కొత్త రకం మోసాలు
– డిఫాల్టర్స్ కే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొగ్గు?
– ఆదిత్య.. మరో సాహితీలా తయారైందా?
– రేపోమాపో బిచానా ఎత్తేయడమేనా?
క్రైంబ్యూరో, తొలివెలుగు:ఆదిత్య కన్ స్ట్రక్షన్ అంటే అందరికీ గుర్తుకొచ్చే పేరు తోట చంద్రశేఖర్. ఈయన మాజీ ఐఏఏస్ అధికారి. మహారాష్ట్ర ప్రభుత్వ నిధులు.. ఐసీఐసీఐ బ్యాంకులో డిపాజిట్ చేసినందుకు హైదరాబాద్ లో ఈయన బంధువుల రియల్ కంపెనీలకు 50 కోట్ల రుణాలు అందాయని రియల్ వర్గాలు చెబుతున్నాయి. వాటితో వివాదాస్పద భూముల్లో పెట్టుబడులు పెట్టి వందల కోట్లకు ఎదిగారని.. అయితే పాపం సొమ్ము ఎక్కువ రోజులు ఉండదు అన్నట్టుగా ఆదిత్య కన్ స్ట్రక్షన్ పరిస్థితి ఉందని అంటున్నాయి. తెలంగాణ ల్యాండ్ మాఫియా డాన్ గా పిలిచే గోల్డ్ స్టోన్ ప్రసాద్ తో చేతులు కలిపి భూ దందా చేశారని విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర సీఎస్ భర్త పార్ధసారథి అమ్మిన భూమిలో నిర్మాణాలు చేపట్టారు. సుప్రీంకోర్టులో ఒక రకమైన తీర్పు ఇస్తే, సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులను ధిక్కరించి హైకోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చి మరో తీర్పు తెచ్చుకుని భూ కబ్జాలకు తెగపడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. 2014 నుంచి జరుగుతున్న ఈ భూ మాఫియా స్కాంలో అధికారులు అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో 6 ఏండ్ల నుంచి కస్టమర్స్ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. వాళ్లు అమ్మినప్పుడే రిజిస్ట్రేషన్. మళ్లీ అమ్ముకోవడానికి వీలుండదు. రిజిస్ట్రేషన్ జరగదు. అంటే వారికి అనుకూలంగా వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
షేక్ పేట్ లో షాకింగ్ నిజాలు
రియల్ ఎస్టేట్ లో తోట వ్యాపారం అంతగా ఆశించిన స్థాయిలో లేదు. పేరుకు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నా.. నిర్మాణం, నిర్వహణ చేపట్టే సత్తా రోజురోజుకీ దిగజారిపోతోంది. ఆస్తులకు మించి అప్పులు ఉండటంతో ప్రాజెక్ట్స్ ని థర్డ్ పార్టీలకు అప్పగిస్తున్నారు. షేక్ పేట్ లోని అదిత్య ఎంప్రెస్ లో ఎఫ్, జీ, హెచ్ మూడు బ్లాక్ ల్లో సుమారు 600 ప్లాట్స్ ని అమ్మకం జరిపారు. కస్టమర్స్ కి రిజిస్ట్రేషన్ అదిత్య వారు చేసినా.. మరో పార్టీకి నిర్మాణం, అమ్మకం చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. 85 శాతం పనులు పూర్తయ్యాయి. ఏడాది క్రితమే ఇవ్వాల్సిన ప్లాట్స్ ని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. థర్డ్ పార్టీకి ఒప్పందం ప్రకారం అనుకున్నట్లు బిల్ల్స్ ఇవ్వకపోవడంతో మధ్యలోనే పనులు ఆగిపోయాయి. కస్టమర్స్ కి మాత్రం ఈ వారంలో పనులు పూర్తి అవుతాయి.. వచ్చే వారం ఇచ్చేస్తామంటూ 6 నెలల నుంచి తిప్పుతున్నారు. ఇప్పటికీ ట్రాన్స్ ఫార్మర్ కి అప్లయ్ చేయకుండానే సొంతింటి దారులను మభ్య పెడుతున్నారు. వినియోగదారులు డబ్బులు ఆలస్యంగా చెల్లిస్తే.. చక్రవడ్డీ, బారు వడ్డీలు వేసి మరీ లాగేస్తుంటారు. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకుంటే నానా ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు వాపోతున్నారు. అదేమని అడిగితే.. బౌన్సర్స్ తో బెదిరింపులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు.
హఫీజ్ పేట్ లో అధికార పార్టీ అండ?
హఫీజ్ పేట్ ప్లై ఓవర్ వద్ద నిర్మించిన అపార్ట్మెంట్ లో గొడవలతోనే వినియోగదారులకు అప్పగించారు. సర్వే నెంబర్ 78లో 8 ఎకరాల బాగోతం మరోసారి పునరావృతం అవుతోంది. 4 ఎకరాల్లో నిర్మాణం చేసి ఇప్పటికి 6 ఏండ్లు అయినా ఇంటి తాళాలు ఇవ్వలేదు. ఫార్చున్ హైట్స్ అనే పేరుతో పర్మిషన్ తేదీలు ముగిసినా ఇంకా నిర్మాణాలు చేపడుతున్నారు. ఆ ఇద్దరి బిల్డర్స్ లో ఒక్కరికి బిల్లులు ఆపివేసి మరొకరితో పనులు చేపడుతున్నారు. సుప్రీం కోర్టులో టైటిల్ పై విచారణ కొనసాగుతోంది. అయినా థర్డ్ పార్టీ విక్రయం పేరుతో దందా కొనసాగిస్తున్నారు. అమాయకపు ప్రజలకు 7,500 లకు స్క్వేర్ ఫీట్ అంటూ కోటి 50 లక్షలకు అమ్మేస్తున్నారు. ఇలా ఇప్పటికే 1200 మందిని ముంచిన తోట చంద్రశేఖర్ మరి కొంతమందిని ముంచేందుకు సిద్ధమయ్యారని కస్టమర్స్ అందోళన చెందుతున్నారు. అధికారులను సైతం ఈయన మ్యానేజ్ చేస్తున్నారని అంటన్నారు.
స్పందించని జీహెచ్ఎంసీ అధికారులు
హఫీజ్ పేట్ లో ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారు. నోటరీలతో జీరో పర్మిషన్స్ తోనే 8 అంతస్తుల భవనాలు లేపేస్తారు. అలాంటిది 2015లో అనుమతులు పొందిన ఆదిత్య ఆలస్యం అయినా పనులను పట్టించుకోవడం లేదు. వందలాది మంది కస్టమర్స్ గోసను వినే నాథుడే కనపడటం లేదు. రెరా అనుమతులు లేవు. జీహెచ్ఎంసీ స్పందన కరువైంది. దీంతో సీసీపీ దేవేందర్ రెడ్డికి లేఖలు రాస్తున్నారు బాధితులు. దీనిపై తొలివెలుగు క్రైంబ్యూరో వివరణ అడగ్గా ఇన్స్పెక్షన్ చేస్తామని రెండు రోజుల క్రితం చెప్పి.. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంంది.
మోసగాళ్లకు అండగా పంజాబ్ నేషనల్ బ్యాంక్?
సరైన పత్రాలు లేకుండానే లోన్స్ ఇచ్చే బ్యాంకు ఏదైనా ఉందంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనే సెటైర్లు తరచూ వినిపిస్తుంటాయి. సీబీఐ కేసుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు ది మొదటి ర్యాంక్. అంతా మోసపోయిన తర్వాత చివరకు ఫిర్యాదులు చేస్తుంటారు. బ్యాంకు మేనేజర్స్ కమీషన్స్ కి ఆశపడి ఇష్టానుసారంగా ప్రజల సొమ్మును రుణాల రూపంలో ఇచ్చేస్తుంటారని ఆరోపణలు ఉన్నాయి. టైటిల్ లేకుండానే మరోకరికి భూమి వెళితే తీవ్రంగా నష్టం తప్పదు. ఇలా హైదారాబాద్ భూములపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు ఎన్నో మొండిబాకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆదిత్య లోన్స్ పై కూడా దర్యాప్తు చేయాలని బ్యాంకర్స్ కి ఫిర్యాదులు అందుతున్నాయి.