2002 లో గుజరాత్ సీఎంగా మోడీ ఉండగా బీబీసీ ఆ నాటి నుంచే ఆయన వెంటబడుతోందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఎన్ని వేల కుట్రలు జరిగినా సరే.. సత్యమే జయిస్తుందని, అన్నారు. మోడీపై బీబీసీ తీసిన వివాదాస్పద డాక్యుమెంటరీపై స్పందిస్తూ ఆయన.. ఇన్ని కుట్రలు జరిగినప్పటికీ ప్రతిసారీ మోడీ మరింత బలోపేతంగా, మరింత పాపులర్ గా అవుతూ వచ్చారన్నారు. ‘హీ ఆల్వేస్ కమ్స్ ఔట్ షైనింగ్’ అని వ్యాఖ్యానించారు.
అదానీ వివాదం మీద, ఈ బీబీసీ డాక్యుమెంటరీ పైన తలెత్తిన దుమారంపై అమిత్ షా.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ఆ నాటి నుంచే మోడీ మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయన్నారు.కానీ సత్యమన్నది సూర్యునిలా ప్రకాశిస్తుందన్నారు. ఢిల్లీ, ముంబై నగరాల్లోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు జరగడానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యాలయాలపై తాము సర్వే నిర్వహించామని ఐటీ అధికారులు చెబుతున్నప్పటికీ సిబ్బంది మొబైల్ ఫోన్లను సీజ్ చేయడం, వారిని బయటకు వెళ్ళొద్దని ఆదేశించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
గుజరాత్ అల్లర్లు, నాడు మోడీ వహించిన పాత్రపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ఇండియాలో ప్రసారం చేయరాదని గత జనవరి 21 న కేంద్రం ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలను ధిక్కరించి పలు రాష్ట్రాల్లో యూనివర్సిటీల విద్యార్థులు దీన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. విపక్షాలు కూడా ఈ నిషేధాన్ని తప్పు పట్టాయి.