– బడా కంపెనీల అడుగులకు మడుగులు
– 15 సంస్థల దగ్గర కొనొద్దని ప్రకటనలు
– సోమేష్ కుమార్ ఉన్నన్ని రోజులూ అక్రమ సంపాదనే!
– ఇప్పుడు ప్రచారం చేసి దోచుకుంటున్న వైనం
– పెట్టుబడిదారులకు పుట్టిన చట్టంలా వ్యవహారం
– టైటిల్ లేకుండానే సాహితీకి సర్టిఫికేట్
– యాక్ట్ మాటున యాక్టింగ్ కింగ్స్ లా రెరా డైరెక్టర్స్
క్రైంబ్యూరో, తొలివెలుగు: తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇన్నాళ్లూ ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని యంత్రాంగం తాజాగా పబ్లిక్ నోటీసుల పేరుతో దందాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు లేకుండా కేవలం నోటీస్ పేరుతో చేతులు తడపగానే దులుపుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇలా అన్నింటికీ వర్తిస్తాయా అంటే సమాధానం ఉండదు. కేవలం వారికి డబ్బులు ఎలా సంపాదించాలో, ఎలా అయితే రియల్ వ్యాపారులు ఇస్తారో మధ్యవర్తులు చెప్పినట్లే ఫైల్స్ బదిలీ చేస్తుంటారని చర్చించుకుంటున్నారు. మోసపోయామని ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు. ఎవరో అకాశరామన్న ఫోన్ చేస్తే పబ్లిక్ నోటీసులతో అక్కడ కొనుగోలు చేయొద్దని ఓ ప్రకటన ఇచ్చి చేయి దులుపుకుంటున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ లేకపోవడంతో కంపెనీల ప్రైవేట్ పనులు కూడా చేసి పెడుతున్నారని తెలుస్తోంది. ఇన్నాళ్లూ రెండు చేతులా సంపాదించిన అధికారులు ఇప్పుడు అంతకు దబుల్ దోచుకుంటున్నారని కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు విమర్శిస్తున్నాయి.
వ్యత్యాసంలో రెరాను మించిన డిపార్ట్ మెంట్ లేదు!
సైబర్ నేరగాళ్ల జుట్టులో నుంచి పుట్టినట్లు వ్యవహరిస్తుంటారు రియల్ ఎస్టేట్ మోసగాళ్లు. రూపాయి ఖర్చు పెట్టకుండానే సొంతింటి ఆశ ఉన్న మధ్య తరగతి కుటుంబాలను ఇట్టే మాయ చేస్తుంటారు. అలాంటి వాటిపై కఠినంగా వ్యవహరించాల్సిన రెరా మాత్రం దాగుడు మూతలు ఆడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని కంపెనీలకు మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందన్నట్లుగా వ్యవహరిస్తోంది. బాధితులు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇప్పటికీ బడా కంపెనీలపై ఒక్క కేసు నమోదు చేయలేదు. ఉత్తరప్రదేశ్ ఇప్పటికే 2 వేల కేసులను పరిష్కరిస్తే తెలంగాణ రెరా 2 కేసులను మాత్రమే పరిష్కరించింది. ఆ మాటున భారీగా అవినీతికి పాల్పడుతున్నారని తెలుస్తోంది. సాహితీ లాంటి సంస్థలపై ఫిర్యాదు చేసినా వారికి వివాదంలో ఉన్న భూములకు సర్టిఫికేట్ ఇచ్చారు. ఇలా బడా కంపెనీలపై కోర్టులో కేసులు ఉన్నా పట్టించుకోకుండా సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఆ సర్టిఫికేట్ తో అందరూ క్లియర్ టైటిల్ అనుకుని కొనుగోలు చేశారు. ఇప్పుడు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు అధికారులు. ఇలా చాలా కంపెనీలకు ఆయా స్థాయిని బట్టి అనుకూలంగా ఉంటున్నారు.
రెరా చైర్మన్ నోటిఫికేషన్ లో వివరాలు ఎక్కడ?
సెక్షన్ 43(1) ప్రకారం ఏడాది లోపు అప్పిలేట్ ట్రైబ్యునల్ అథారిటినీ ఏర్పాటు చేయాలి. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్లుగా అథారిటీని నియమించలేదు. మాజీ సీఎస్ అన్నీ తానై వ్యవహరించారు. దీంతో హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిటిషన్ దాఖలు చేసింది. 11 నెలలైనా కౌంటర్ దాఖలు చేయలేదు ప్రభుత్వం. గత నెల 16న ఒక చైర్ పర్సన్, ఇద్దరి హోల్ టైమ్ మెంబర్స్ గా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది మున్సిపల్ శాఖ. అయితే, రెరా వెబ్ సైట్ అడ్రస్ ఇచ్చినా అక్కడ ఎప్పుడు చూడాలన్నా ఎర్రర్ వస్తోంది. నోటిఫికేషన్ లో కనీస అర్హత, కాల పరిమితి జీతభత్యాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. తాము అనుకున్న వారికి కట్టబెట్టడం కోసమే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ కంపెనీల్లో కొనుగోలు చేయవద్దు..?
ఆరేండ్ల తర్వాత రెరా తన చట్టానికి పదును పెట్టినట్లు నటిస్తోంది. చట్టంలోని సెక్షన్ 3(1) ప్రకారం రెరా అనుమతి లేకుండా ఎలాంటి ప్లాట్, ఫ్లాట్, విల్లాలు విక్రయించకూడదని ఉంది. అలా అమ్మే వాటిలో కొనుగోలు చేయకూడదని తెలియజేస్తుంది. అయితే, ఈ నిబంధనలు కొన్ని కంపెనీలకే పరిమితం అవుతోందని విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదుల పేరుతో చర్యలు తీసుకుంటున్నారు తప్ప అసలైన బాధితులు ఎవరినీ గుర్తించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ మాఫియా ఫిర్యాదులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగానే యోషితా ఇన్ఫ్రా సదాశివపేట్ టౌన్ లో వేసిన వెంచర్ లో ప్లాట్లను కొనవద్దని అంటున్నారు. యూనిక్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పిగ్లీపూర్ గ్రామం, 17/1 సర్వే నెంబర్ వేసిన వెంచర్, సూర్యాపేట్ వద్ద ఎలైట్ సాయి డెవలపర్స్ వంటి వెంచర్లలో ప్లాట్లు కొనకూడదని చెబుతున్నారు. మరిన్ని సంస్థలపై ప్రెస్ నోట్ పంపించే అవకాశాలు ఉన్నాయని లీకులు ఇచ్చి మరీ దోచుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి.లేఖ్య ఇన్ఫ్రా డెవలపర్స్ సంగారెడ్డి, కేవీఎస్ హోమ్స్, పిల్లలమర్రి గ్రామం, సూర్యాపేట్ సర్వే నెం.174 , జేబీ ఇన్ఫ్రా, చౌటుప్పల్, దేవులమ్మ గ్రామం, సర్వే నెం 493, అలేఖ్య ఎస్టేట్స్, పెద్దాపూర్, సర్వే నెంబర్లు 497/బి, 498, 499/బి, సంగారెడ్డి, అక్షితా ఇన్ఫ్రా సూర్యాపేట్, విశ్వ డెవలపర్స్, రాజాపూర్, సర్వే నెం. 50/పీ, 140/పీ, 141/పీ, 101 ఎకర్స్, ఫార్మా ఎలైట్, అమేజ్, ఫార్మా నేచర్ సిటీ నందిపర్తి, యాచారంలోని భువనతేజ ఇన్ఫ్రా, ఆర్ జే హోమ్స్, ఏవీ ఇన్‌ఫ్రాకాన్ వెంచర్లు, అపార్టుమెంట్ల లిస్ట్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రెస్టీజ్ ఎస్టేట్స్‌పై జరిమానా?
బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ అనే సంస్థ కోకాపేట్ లో ప్రీ లాంచ్ లో ఫ్లాట్లను విక్రయిస్తోందని గమనించింది. దీంతో అమ్మిన ప్రతి ఫ్లాట్ మీద రూ.25 వేల జరిమానా విధించడానికి రెరా సిద్ధం అయినట్టు తెలుస్తోంది. 800 ఫ్లాట్స్ అమ్మినట్లు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వివరాలు రాబట్టారు. అలా 2 కోట్ల వరకు జరిమానా ఉంటుందని లీకులు ఇస్తున్నారు.
ఇన్నాళ్ల పాటు జరిగిన వ్యవహారంపై మౌనం
ఫినిక్స్, సాహితీ లాంటి బడా సంస్థలకు కోర్టులో కేసులు పెండింగ్ ఉండగానే సర్టిఫికేట్ ఇచ్చేశారు. ఇలా పెద్ద పెద్ద కంపెనీల పట్ల ఎలాంటి రూల్స్ పాటించకుండానే యథేచ్ఛగా వ్యవహరించారు. ఇప్పటికీ వాటిపైన జరిమానాలు వేయలేదు. మోసపోయామని ఫిర్యాదులు చేసినా క్రిమినల్ కేసులకు ప్రపోజల్ పెట్టలేదని బాధితులు చెబుతున్నారు. వారికి ఇష్టం లేకపోయినా, అనుకున్నంత సొమ్ము ఇవ్వకపోయినా రెరా తన ప్రతాపం చూపిస్తుందనే విమర్శలను కొత్తగా మూటకట్టుకుంటోంది. అందరికీ ఒకే రూల్ లా ఉండాలని కోరుకుంటున్నారు రియల్టర్స్.