మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఏ శాఖలో చూసినా ఎక్కడో ఓ స్థాయిలో అవినీతి అధికారులు జలగల్లా పేదల రక్తాన్ని పీలుస్తున్నారు. తాజాగా జవహర్‌నగర్ రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ రమేష్ ఆగడాలను భరించలేకపోతున్నామంటూ కొందరు బాధితులు మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ.. నిర్దాక్షిణ్యంగా జేసీబీలతో తమ ఇళ్లను ఆర్ఐ రమేష్ కూలగొట్టారని వారు ఆరోపిస్తున్నారు. పైసా పైసా కూడబెట్టి ఇళ్లను కట్టుకుని.. నీళ్లు, కరెంట్ వంటి అనుమతులన్నీ తెచ్చుకున్న తర్వాత కూడా నేలమట్టం చేశారని కన్నీంటి పర్యంతమవుతున్నారు. ఇదేంటని అడిగితే డబ్బులు ఇస్తేనే ఇళ్లు ఉంటాయని..మిగిలిన వారికి కూడా అదే పరిస్థితి వస్తుందని బెదిరిస్తున్నాడని వాపోతున్నారు.
కార్పొరేషన్‌లో పరిధిలో ఎన్నో పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు ఉన్నా వాటిపై చర్యలు తీసుకోకుండా.. నిరుపేదలైన తమపై ప్రతాపం చూపించడంపై మండిపడుతున్నారు. ఈ మేరకు ఆర్ఐ చర్యలు తీసుకోవాలని కోరుతూ హెచ్చార్సీని ఆశ్రయించేందుకు బాధితులు రెడీ అవుతున్నారు.