ఏపీ ప్రభుత్వంలో శాఖల కేటాయింపులు.. మార్పులు జరగబోతున్నాయా..? హఠాన్మరణం చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి నిర్వహించిన శాఖలను ఎవరికి కేటాయిస్తారు..? సీఎం తన వద్దే ఉంచుకుంటారా..? మంత్రులకు కేటాయిస్తారా..? ఇప్పుడు ఏపీ ప్రభుత్వ వర్గాల్లో ఈ చర్చ జోరుగా నడుస్తోంది. ఐటీ, పరిశ్రమలు వాణిజ్యం, పెట్టుబడులు మౌలిక వసతులు, చేనేత జౌళి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖల బాధ్యతలను గౌతమ్ నిర్వర్తించేవారు. ఇప్పటికే కేబినెట్ లో ఉన్న అందరు తమ శాఖల పనులతో బిజీగా ఉంటున్నారు. కొత్త శాఖలు.. అందునా అవి కీలకమైనవి కావటంతో ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తి కరంగా మారింది.
గౌతమ్ బాధ్యత వహించిన శాఖలను ఎవరికి అప్పగిస్తారు అనే చర్చ ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది. అయితే.. త్వరలోనే కేబినెట్ విస్తరణ జరుగుతుందనే చర్చ సాగుతోంది. మార్చి 8వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాలు పూర్తయిన తర్వాత విస్తరణ ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ఉండటంతో.. సమావేశాల్లో ఆ శాఖలకు సంబంధించిన సమాధానాలు చెప్పటానికి.. చర్చల కోసం ముగ్గురు మంత్రులకు గౌతమ్ నిర్వహించిన అయిదు శాఖలను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
మంత్రులు రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్ లకు గౌతమ్ చూసిన శాఖలను అదనపు పోర్టు ఫోలియోలుగా కేటాయించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు మాత్రమే వారు ఈ శాఖల పర్యవేక్షణ చేయనున్నట్టు తెలుస్తోంది. దీని పైన అధికారికంగా ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. ఇక.. ఇప్పటికే గౌతమ్ ప్రాతినిధ్యం వహించిన ఆత్మకూరు అసెంబ్లీ సీటు ఖాళీ అయినట్లుగా అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం పంపింది ప్రభుత్వం.
ఖాళీ అయిన ఆత్మకూరు నియోజకవర్గంలో ఉప ఎన్నికను ఆరు నెలల్లోగా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10 న వెల్లడికానున్నాయి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత… ఆ తరువాత విడదలయ్యే ఎన్నికల షెడ్యూల్ లో ఆత్మకూరు ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరోవైపు.. గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందటంతో.. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దాదాపుగా ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇతర పార్టీల నుంచి పోటీ ఉండే అవకాశం లేదంటున్నారు. అయితే.. వైసీపీ నుంచి తిరిగి మేకపాటి కుటుంబానికే ఆత్మకూరు సీటు కేటాయించే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మేకపాటి కుటుంబం ఇంకా గౌతమ్ హఠాన్మరణం షాక్ నుంచి తేరుకోకపోవడంతో ఇంకా దానికి సంబంధించిన చర్చను తెరమీదకు తీసుకురావడంలేదంటున్నారు నిపుణులు.
మరి కొంత సమయం తీసుకున్న తరువాత..మేకపాటి కుటుంబ సభ్యులతో చర్చించి..ఆ కుటుంబం నుంచే ఒకరిని ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఖరారు చేసే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే లోగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అది ఏం జరుగుతుందో చూడాలి మరి.