తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు క్రీడా ఆణిముత్యాలకు హైదరాబాద్ లో ఇంటి స్థలాలను కేటాయించింది. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్, ఎయిర్ పిస్టల్ షూటింగ్ నేషనల్ ఛాంపియన్ షిప్ లో ట్రిపుల్ గోల్డ్ మెడల్ సాధించిన ఈషాసింగ్, ఇండియన్ ఫుట్ బాల్ క్రీడాకారిణి సౌమ్యలకు 600 గజాల చొప్పున స్థలాలను మంజూరు చేస్తూ సీఎస్ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇద్దరికి జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ సమీపంలో, మరొకరికి ఎల్బీనగర్ బీఎన్ రెడ్డి నగర్ కు దగ్గరలో స్థలాలను సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేశ కీర్తి పతాకాన్ని ఎగిరేసిన క్రీడాకారులను సముచితంగా గౌరవించుకునే విధంగా ప్రైమ్ లొకేషన్ లో స్థలాలను ఇవ్వాలన్న ఆదేశాల మేరకు అధికారులు ఖాళీ స్థలాల గురించి బుధవారం ఆరా తీశారు.
ఎక్కడెక్కడ నివాసయోగ్యమైన స్థలాలు అందుబాటులో ఉన్నాయనేది గుర్తించిన అధికారులు నివేదికను సీఎస్ కు అందజేశారు. అదికారులు అందించిన నివేదికలోని మూడింటిని ఎంపిక చేసిన సీఎస్.. స్థలాలతో పాటు నగదు పురస్కారాన్ని గురువారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో స్వయంగా సీఎం కేసీఆర్ అందజేయనున్నట్టు తెలిపారు.
అటు పద్మశ్రీ కిన్నెరమెట్ల మొగిలయ్యకు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కోటి రూపాయల నగదు పురస్కారానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొగిలయ్య కోరుకున్న విధంగా బీఎన్ రెడ్డి నగర్ కాలనీలో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.