మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి మధ్య గొడవలు జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో తరుచూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మా మధ్య ఎలాంటి గొడవలు లేవంటూ.. మేమంతా ఎంతో హ్యాపీగా ఉన్నామంటూ అటు చిరు, ఇటు అ్లలు అరవింద్ ఎన్ని సార్లు క్లారిటీ ఇచ్చినా కూడా ఈ రూమర్లకు చెక్ పడటం లేదు. రెండు కుటుంబాల మధ్య ఏదో మనస్పర్థలు ఉన్నాయని, డిస్ట్రబెన్స్‌లు వచ్చాయని గత కొన్నేళ్లుగా వార్తలు, పుకార్లు వస్తూనే ఉన్నాయి. అదేం కాదు, అలాంటిదేం లేదు అంటూ ఎప్పటికప్పుడు ఏదో విధంగా చెబుతున్నా.. ఆ పుకార్ల షికార్లు మాత్రం ఆగడం లేదు.
అయితే మళ్లీ ఇదే విషయంపై అల్లు అరవింద్ తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చి.. అసలు విషయం బయట పెట్టేశారు. తాజాగా అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల వేదికపై అల్లు అరవింద్, మెగాస్టార్ చిరంజీవి కనిపించారు. వేదిక మీద అందరిపై జోకులు వేస్తూ ఎంతో సరదాగా ఉన్నారు. అయినప్పటికీ అల్లు – కొణిదెల కుటుంబాల మధ్య ఏదో ఇబ్బంది అనే వార్తలు రానే వస్తున్నాయి.
అల్లు అరవింద్ మాట్లడుతూ.. ఇది చాలా సహజం. సమాజంలో ఇలాంటివి వస్తూనే ఉంటాయి. మేమిద్దరం బావబామరిది కన్నా బాగా దగ్గరి స్నేహితులుగా ఉన్నాం. అలాగే ఎదిగాం. అలానే మా కుటుంబాలు కూడా ఎదిగాయి. పిల్లలు పుట్టారు. వారు ఇదే వృత్తిలో ఉన్నారు. మనకున్నది చిన్న ఫిల్మ్ సొసైటీ. అందుబాటులో ఉన్న అవకాశాలను వీళ్లు పంచుకోవాలి. అటువంటప్పుడు పోటీ ఉంటుంది.
ఆ సందర్భంలో ప్రజలు ఇలా రూమర్స్ మాట్లాడుకోవడం సహజమే. అయితే వారు గ్రహించాల్సింది ఏంటంటే.. వీళ్లంతా ఒకటే అని చెప్పారు అరవింద్. ఇక కొన్ని సెలబ్రేషన్స్ కి, పండుగలకు మేము మా బావ ఇంటికి వెళ్తాం. అలాగే ఇంకొన్ని పండుగలకు చిరంజీవి ఫ్యామిలీ మా ఇంటికి వస్తారు. ఇది ఇప్పటికీ జరుగుతున్నాయన్నారు అల్లు అరవింద్.